ప్రముఖ ఆద్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ వివాదంలో చిక్కుకున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఐదు గోల్డ్ మెడల్స్ సాధించిన భారత మహిళా స్పింటర్ ను అభినందించే  క్రమంలో అయన తప్పు చేశారు. ఆంగ్లంలో లైంగిక చర్యకు సంబంధించిన పదాన్ని ఉపయోగిస్తూ పొరపాటును ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు.

''హిమదాస్, ఎ గోల్డెన్ షవర్ ఫర్ ఇండియా, నీకు అభినందనలు మరియు  ఆశీర్వాదాలు'' అంటూ వాసుదేవ్ ట్వీట్ చేశారు. అయితే అతడు వాడిన  గోల్డెన్ షవర్ అనే పదమే ఆయన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఈ పదాన్ని ఆంగ్లంలో లైంగిక చర్యకు సంబంధిన విషయాల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి అభ్యంతరమైన పదాన్ని హిమదాస్ ను అభినందించడానికి చేసిన ట్వీట్ లో వాడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా పేరుప్రతిష్టలు కలిగిన ఓ ఆద్యాత్మిక గురువు ఇలా వ్యవహరించడంపై మరింతగా వివాదాన్ని రాజేస్తోంది. 

అయితే జగ్గీ వాసుదేవ్ భక్తులు మాత్రం ఈ తప్పు స్వయంగా ఆయనచేసింది కాదని అంటున్నారు.  అసలు సద్గురు ఎలాంటి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించరని... అయితే కొందరు వాలంటీర్లు మాత్రం ఆయన పేరుతో, ఆశ్రమం పేరుతో ఆ పని చేస్తుంటారని చెబుతున్నారు. అలా వాలంటీర్లు చేసిన తప్పుకు సద్గురును నిందించడం తగదంటూ విమర్శలకు సూచిస్తున్నారు.