దుబాయ్: ఐపిఎల్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్న స్టార్ క్రికెటర్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో సీజన్ 13 కు దూరమయ్యాడు.  అతడితో పాటు మరో ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా టోర్నీ ఆరంభానికి ముందే సీఎస్కేకు హ్యాండిచ్చాడు. దీంతో వారిద్దరిపై తీవ్ర ఆగ్రహంతో వున్న సీఎస్కే యాజమాన్యం వారిద్దరిని శాశ్వతంగా జట్టు నుండి తొలగించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ఇటీవల చేసిన కామెంట్సే నిదర్శనం. 

ఇక సురేష్ రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని సీఎస్‌కే సీఈవో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్‌ నుంచి తప్పుకున్నప్పటికి ఆ లోటును పూడ్చటానికి రిజర్వుబెంచ్‌ కు పరిమితమైన ఆటగాళ్లను బరిలోకి దింపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మాటలను బట్టి చూస్తే ఇక రైనా చెన్నై జట్టులో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. 

read more   IPL 2020 :ప్రాంఛైజీలకు బీసీసీఐ షాక్‌: రూ. కోటి జరిమాన, పాయింట్లలో కోత

ఇక ఇప్పటికే అర్దాంతరంగా జట్టుకు దూరమైన రైనా, హర్భజన్ పేర్లను అధికారిక వెబ్ సైట్ నుండి తొలగించింది సీఎస్కే. ఈ క్రమంలోనే వారిద్దరితో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేసుకుని శాశ్వతంగా వారిని జట్టులోంచి తొలగించే చర్యల్లో భాగమే ఈ పేర్ల తొలగింపు అని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సీఎస్కే యాజమాన్యం నిర్ణయం కూడా తీసుకుందట. 

దీంతో వచ్చే సీజన్ లో అయినా రైనా సీఎస్కే తరపున ఆడతాడన్న అభిమానుల ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ కాంట్రాక్టుల రద్దుపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.