సురేశ్ రైనా... భారత జట్టులో ఆడిన దానికంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనే అద్భుతంగా ఆడతాడు. అందుకే సురేశ్ రైనాని ‘మిస్టర ఐపీఎల్’ అని ముద్దుగా పిలుస్తారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు రైనా. బ్యాటింగ్‌లోనే కాదు, మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడం, గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌లు అందుకోవడమూ రైనాకి బాగా తెలుసు. ‘తలైవా’ మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తుడిగా ఉంటూ ‘చిన్న తల’గా పేరొందిన రైనాకి తమిళనాడులో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు రైనా. వ్యక్తిగత కారణాల వల్ల దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చేశాడు. దుండగులు చేసిన దాడిలో రైనా మామగారు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్ సంఘటన కారణంగా కుటుంబానికి అండగా ఉండేందుకు చెన్నై జట్టుకు దూరమయ్యాడు రైనా. అయితే చెన్నై జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన సురేశ్ రైనా జట్టుకు దూరం కావడం సూపర్ కింగ్స్‌ ఆటతీరుపై కచ్ఛితంగా ప్రభావం చూపనుంది. 

ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించిన రైనా, ఇప్పటిదాకా లీగ్ కెరీర్‌లో 5368 పరుగులు చేశాడు. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ, రైనాను అధిగమించి టాప్‌లోకి వెళ్లాడు. 38 హాఫ్ సెంచరీలు చేసిన రైనా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీ రోల్ పోషించాడు. రైనా లేకపోవడంతో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది కూడా ప్రశ్నగా మారింది.

కొందరు ఆసీస్ ప్లేయర్ సామ్ కురాన్ ఆ ప్లేస్‌లో సూట్ అవుతాడని అంటుంటే, మరికొందరు అంబటి రాయుడు ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని విశ్లేషిస్తున్నారు. అయితే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే మహేంద్ర సింగ్ ధోనీ, ఈసారి టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తే చూడాలనేది చాలామంది కోరిక. స్వాతంత్య్ర దినోత్సవాన భారత క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగి 15 నెలలు దాటింది. 

గత ఏడాది వన్డే వరల్డ్‌కప్ సెమీ-ఫైనల్ తర్వాత ధోనీ మళ్లీ క్రికెట్ ఆడలేదు. ధోనీ ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ప్రెషర్‌ను మోస్తూ ధోనీ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సురేశ్ రైనా, హర్భజన్ వంటి సీనియర్లు లేకపోవడం కూడా ధోనీని మరింత ఒత్తిడిలోకి నెట్టేయొచ్చు. ఎలా చూసినా చెన్నైకి ఈసారి కష్టాలు తప్పకపోవచ్చు. అయితే ఏ క్రికెటర్ ఉన్నా, లేకపోయినా జట్టును విజయవంతంగా నడిపించే సత్తా ధోనీకి ఉందని మాజీ క్రికెటర్ అగార్కర్ వ్యాఖ్యానించారు. మరి ధోనీ జట్టు ఈ సీజన్‌లో ఎలా ఆడబోతుందనేది మరో ఐదురోజుల్లో తెలిసిపోతుంది.