ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కంటే సీఎస్‌కేకి క్రేజ్ ఎక్కువ. దీనికి ఒకే ఒక్క కారణం... మహేంద్ర సింగ్ ధోనీ. తన కెప్టెన్సీతో భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలబెట్టాడు. 8 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై, పదిసార్లు ప్లే ఆఫ్ చేరుకుంది. రెండేళ్లు నిషేధం పడినా మూడు సార్లు టైటిల్ గెలిచి, ముంబై తర్వాతి స్థానంలో ఉంది. దీనంతటి కారణం కూడా మిస్టర్ కూల్ మాహీ కెప్టెన్సీయే.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం లీగ్ ఆరంభంలో ధోనీని కొనడానికి ఆసక్తి చూపించలేదట. వారి ఫోకస్ మొత్తం వేరే ప్లేయర్ మీద ఉందట. అతను మరెవ్వరో కాదు, ‘డాషింగ్ ఓపెనర్’ వీరేంద్ర సెహ్వాగ్.

టెస్టు మ్యాచులను వన్డేల్లా, వన్డేలను టీ20 మ్యాచుల్లా ఆడే వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎలాగైనా చెన్నైకి ఆడించాలని తెగ ప్రయత్నించారట సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్. అయితే వీరూ తన సొంత ప్రాంతమైన ఢిల్లీకి ఆడాలని కోరుకున్నాడు. దీంతో నిరాశ చెందిన సీఎస్‌కే, ధోనీని సొంతం చేసుకుంది.

మొదటి సీజన్ ప్రారంభానికి అంటే 2008లో కేవలం నాలుగేళ్ల అంతర్జాతీయ అనుభవం కలిగిన ధోనీ, చెన్నై జట్టును ఎలా నడిపిస్తాడో అని అందరిలో అనుమానాలు కలిగాయి. అయితే మాహీ మ్యాజిక్ చేసేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెన్నైకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ కూడా ధోనీయే. మిగిలిన జట్లన్నీ కెప్టెన్లను మార్చేశాయి. సీఎస్‌కే మాత్రం ధోనీ మేనియాతో ‘విజిల్ పోడు’ అంటూ బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకుంది.