భారత బాక్సింగ్ లెజెండ్ నాంగోమ్ డింకో సింగ్ ఆకస్మిక మృతి... 42 ఏళ్ల వయసులోనే...
నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ బాక్సర్ డింకో సింగ్... గురువారం చికిత్స పొందుతూ తుదిశ్వాస...
1998 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన డింకో సింగ్...
భారత మాజీ బాక్సింగ్ లెజెండ్, ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ బాక్సర్ నాంగోమ్ డింకో సింగ్ మరణించారు. దాదాపు నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, 42 ఏళ్ల వయసులో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మణిపూర్ రాష్ట్రానికి చెందిన డింకో, 2017లో లివర్ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. గత ఏడాది క్యాన్సర్‌కి రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స చేయించుకున్నప్పటికీ, కొన్నాళ్ల కిందట కరోనా సోకడంతో ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.
బాక్సర్ నాంగోమ్ డింకో సింగ్ మరణంతో బాక్సింగ్ వరల్డ్‌లో విషాదం నెలకొంది. భారత స్టార్ బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీ కోమ్, డింకో సింగ్ మృతికి నివాళులు ఘటించారు.
1998లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన డింకో సింగ్, అదే ఏడాది అర్జున అవార్డు గెలిచారు. 2013లో పద్మశ్రీ కూడా వరించింది. కొన్నాళ్లు ఇండియన్ నేవీలో ఉద్యోగం చేసిన డింకో సింగ్, కోచ్‌గా కూడా వ్యవహారించారు.