Asianet News TeluguAsianet News Telugu

మరో రికార్డు కొట్టిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా... నేషనల్ రికార్డు బ్రేక్...

Neeraj Chopra: స్వీడెన్‌లో జరుగుతున్న వాండా డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి, జాతీయ రికార్డు సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా...

 

Indian Javelin Throw Athlete Neeraj Chopra breaks National Record in Diamond League Sweden
Author
India, First Published Jul 1, 2022, 10:01 AM IST

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా పట్టిందల్లా బంగారమవుతోంది. ఒలింపిక్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పోటీల్లో దిగుతున్న నీరజ్ చోప్రా, 15 రోజుల వ్యవధిలో మూడు మెడల్స్ సాధించాడు. అంతర్జాతీయ వేదికలపై రికార్డులు బ్రేక్ చేసే పర్ఫామెన్స్‌లు ఇస్తూ సాగుతున్నాడు.

స్వీడెన్‌లో జరుగుతున్న వాండా డైమండ్ లీగ్‌లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా, ఈ కాంపిటీషన్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల దూరం విసిరి, తన బెస్ట్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు. ఇది నేషనల్ రికార్డు కూడా. రెండో ప్రయత్నంలో 84.37 మీటర్ల దూరం జావెలిన్ త్రోని విసిరిన నీరజ్ చోప్రా, మూడో ప్రయత్నంలో 87.46 మీటర్ల దూరం అందుకున్నాడు.. 

ఆ తర్వాత నాలుగో త్రో 84.77 దూరం వెళ్లగా ఐదో త్రో 86.67 మీటర్ల దూరం అందుకుంది. ఆ తర్వాత ఆఖరి త్రో 86.84 దూరం వెళ్లింది. అయితే ఈ పోటీల్లో గ్రెనడాకి చెందిన జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్ పీటర్స్ అండర్సన్ 90.31 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. 89.94 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు..

2021  టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి, స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, అంతకుముందు గత ఏడాది మార్చిలో పటియాలాలో జరిగిన ఈవెంట్‌లో 88.07 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు క్రియేట్ చేశాడు.. ఈ రికార్డును 15 రోజుల క్రితమే బ్రేక్ చేశాడు నీరజ్ చోప్రా...

జూన్ నెల రెండో వారంలో ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా, 89.30 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేశాడు. అయినప్పటికీ ఈ గేమ్స్‌లో నీరజ్ చోప్రాకి రజతం లభించడం విశేషం. 89.83 మీటర్ల దూరం విసిరిన ఫిన్‌లాండ్ జావెలిన్ త్రో అథ్లెట్ ఓలీవర్ హెలండర్‌ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించాడు...

ఆ తర్వాత వారం రోజులకు ఫిన్‌లాండ్‌లోని కుర్టానే గేమ్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ సాధించాడు.  తన మొదటి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల త్రో నమోదు చేసిన నీరజ్ చోప్రా.. టాప్‌లో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.  ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్, గ్రెనడాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి టాప్‌లో నిలిచాడు. అయితే ఈ పరాభవానికి రెండు వారాల్లోనే ప్రతీకారం తీర్చుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాడు అండర్సన్ పీటర్స్..

Follow Us:
Download App:
  • android
  • ios