భారత్- వెస్టిండీస్ ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ని  టీం ఇండియా కైవసం చేసుకుంది. కాగా.. గురువారం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీనిని కూడా ఎలాగైనా సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది. అయితే... నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ  సీరిస్ కి వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభం సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.. కాకపోతే అది కొద్ది సేపు మాత్రమే పడుతుందని వారు చెప్పారు. 

మ్యాచ్ ప్రారంభించే సమయంలో వర్షం పడితే... ఆట మొదలవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. టీ 20 సిరీస్ గెలిచిన టీం ఇండియా.. ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత ఆడుతున్న తొలి వన్డే ఇదే. ఇక ప్రపంచకప్ లో గాయంతో జట్టుకి దూరమైన శిఖర్ ధావన్ వన్డే సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. అతను రోహిత్ తో కలిసి బ్యాటింగ్ కి దిగనున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ నెంబర్ 4వ స్థానంలో ఆడే అవకాశం ఉంది.

ఇక మిడిల్ ఆర్డర్ లో యువ ఆటగాళ్లు మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ లో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇక ధోనీ స్థానంలో రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా వ్యవహరించనున్నాడు.