టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి కాస్త కోపం ఎక్కువే. మైదానంలో ఉన్నప్పటికీ ఆయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు అన్న విషయం అభిమానులందరికీ తెలుసు. కాగా... ఈ సారి ఆయన తన కోపాన్ని స్టంప్స్ పై చూపించారు. మొహాలిలోని పీసీసీ స్టేడియంలో స్టంప్స్... కోహ్లీ ఆగ్రహానికి బలయ్యాయి.

వాషింగ్టన్ సుందర్ మిస్ ఫీల్డింగ్ చేసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన కోపాన్ని స్టంప్స్‌పై చూపించాడు. చాలా రోజుల మైదానంలో విరాట్ కోహ్లీ మరోసారి తన దూకుడిని ప్రదర్శించాడు.నిజానికి విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటాడు. 

జట్టులోని మిగతా సభ్యులు ఎవరైనా మిస్ ఫీల్డింగ్ లేదా అప్రమత్తంగా ఉన్నా... విరాట్ కోహ్లీ అదే సమయంలో వారిపై తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. మొహాలీ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వాషింగ్టన్ సుందర్ చేసిన చిన్నపాటి తప్పిదానికి కోపంతో ఊగిపోయిన కోహ్లీ అమాంతం తన కాలితో స్టంప్ప్‌ను తన్నాడు.

ఈ సంఘటన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో చోటు చేసుకుంది. బౌండరీతో దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ బౌండరీని వాషింగ్టన్ ఆపడంలో విఫలమయ్యాడు. దీనికి సంబంధించిన వీడీయో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.