Bipin Rawat: త్రివిధ దళాధిపతికి భారత క్రీడా ప్రముఖుల సంతాపం.. రావత్ సేవలను స్మరించుకున్న టెండూల్కర్
Bipin Rawat News: తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక, ఇతర 11 మంది ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.
భారత త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు 12 మంది మరణంపై భారత క్రీడాలోకం స్పందించింది. రావత్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఒలింపిక్ రజత విజేత మీరాబాయి చాను, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లతో పాటు పలువురు క్రీడాకారులు వారి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. భారత క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా వారి సంతాపాన్ని తెలిపారు.
ఈ మేరకు విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ‘హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఇతర అధికారుల మరణం తీవ్రంగా బాధించింది. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి..’ అని ట్వీట్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘జనరల్ బిపిన్ రావత్ దేశానికి గర్వ కారణం. దేశం పట్ల ఆయన నిబద్ధతతో పనిచేశారు. ఇది భారతదేశానికి, రక్షణ దళాలకు విచారకరమైన రోజు.. బిపిన్ రావత్, ఆయన సతీమణి, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇతర అధికారుల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..’ అని పేర్కొన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ.. ‘బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర ఆర్మీ అధికారుల మరణం తీవ్ర బాధ కలిగించింది. రావత్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివి..’ అని రాసుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ ట్వీట్ చేస్తూ.. ‘సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, సాయుధ దళాలకు చెందిన 11 మంది అధికారుల విషాద మరణం తీవ్రంగా కలిచివేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి..’ అని పేర్కొన్నాడు.
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతక విజేత మీరాబాయి చాను, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ లు కూడా వారి సంతాపాన్ని తెలిపారు. వీరితో పాటు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా రావత్ మరణానికి సంతాపం తెలిపింది. ‘మేము గొప్పక్రీడా ప్రేమికుడిని కోల్పోయాం..’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు సుమారివాలా ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు.
వీళ్లే గాక మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వెంకటేశ్ ప్రసాద్, లెజెండరీ స్ప్రింటర్ పిటి ఉష కూడా రావత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
నిన్న తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక, ఇతర 11 మంది ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. నీలగిరి జిల్లాలోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో వీళ్లంతా దుర్మరణం పాలయ్యారు.