CWG 2022: ఆ మూడింటిలో టాప్.. మిగతా క్రీడల్లో డౌన్.. ఈసారైనా భారత కథ మారేనా..?
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో సుమారు 25కు పైగా క్రీడాంశాలున్నా.. భారత్ సుమారు 20 క్రీడల్లో పాల్గొంటున్నా పతకాలు వచ్చేది మాత్రం మూడు ఈవెంట్లలోనే.. మరి ఇకనైనా..
కామన్వెల్త్ క్రీడల్లో ఘన చరిత్ర కలిగిన భారత జట్టుకు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న 22వ దఫా పోటీలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 1958లో స్వర్ణంతో మొదలైన భారత ప్రస్థానం గత గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) కామన్వెల్త్ గేమ్స్ వరకు నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ క్రీడల్లో ఇప్పటివరకు అత్యధిక పతకాలు సాధించిన దేశాల జాబితాలో మొత్తం 503 పతకాలతో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. నాలుగైదు క్రీడల్లో మాత్రమే నిలకడగా రాణిస్తున్నది. మిగిలిన క్రీడల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదనేది చరిత్ర చెబుతున్న సత్యం.
కామన్వెల్త్ తో భారత్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగాల్లో టాప్ లో దూసుకెళ్తుంటే మిగిలిన క్రీడాంశాల్లో ఆశాజనక ఫలితాలు సాధించడం లేదు. భారత్ ఇప్పటివరకు ఈ క్రీడలలో 503 పతకాలు సాధించగా.. అందులో పైన పేర్కొన్న మూడు క్రీడాంశాల్లో సాధించిన మెడల్స్ 362గా ఉన్నాయి. అత్యధిక స్వర్ణాలు కూడా ఆ మూడు విభాగాల్లో ఉన్నవే..
‘గురి’పెడితే బుల్లెట్ దిగాల్సిందే..
షూటింగ్ లో భారత జట్టు ఈ క్రీడలలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది. ఇప్పటివరకు ఈ విభాగంలో 63 స్వర్ణాలు, 44 రజతాలు, 26 కాంస్యాలు వచ్చాయంటే భారత్ షూటింగ్ లో ఏ స్థాయిలో రాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విభాగంలో భారత షూటర్ల గురి తప్పడం లేదు. మొత్తంగా షూటింగ్ లోనే భారత్ 133 పతకాలు అందుకుంది. అదీగాక ఈ క్రీడలలో అత్యంత విజయవంతమైన భారత ఆటగాడు కూడా ఒక షూటరే కావడం గమనార్హం. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా.. కామన్వెల్త్ క్రీడలలో ఏకంగా 15 పతకాలు నెగ్గాడు.
‘ఎత్తితే’ రికార్డుల మోతే..
షూటింగ్ తర్వాత భారత్ అత్యంత విజయవంతమైన మరో విభాగం వెయిట్ లిఫ్టింగ్. ఈ విభాగంలో కూడా మన క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు వెయిట్ లిఫ్టింగ్ లో 43 స్వర్ణాలు, 48 రజతాలు, 34 కాంస్యాలు గెలుచుకుంది భారత జట్టు. మొత్తంగా 125 పతకాలు.
పతకాల ‘పట్టు’పడితే..
పై రెండు విభాగాల మాదిరిగానే రెజ్లింగ్ లో కూడా భారత్ అనుకున్నదానికంటే అద్భుతంగా రాణిస్తున్నది. మన కుస్తీ వీరుల పట్టుకు పతకాలు దాసోహమవుతున్నాయి. ఇప్పటివరకు రెజ్లింగ్ లో భారత జట్టుకు 43 స్వర్ణాలు, 37 రజతాలు, 22 కాంస్యాలు దక్కాయి. ఈ విభాగంలో కూడా మొత్తంగా 102 పతకాలు సాధించింది భారత్. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు తొలి పతకం దక్కిందే రెజ్లింగ్ లో. 1934లో రెజ్లర్ రషీద్ అన్వర్.. రెజ్లింగ్ లో భారత్ కు కాంస్య పతకాన్ని అందించాడు.
ఇవీ మెరుగవుతున్నాయి..
పైన పేర్కొన్న మూడు క్రీడాంశాలతో పాటు భారత్ కొంతకాలంగా బాక్సింగ్ (37 పతకాలు), బ్యాడ్మింటన్ (25), టేబుల్ టెన్నిస్ (20) లలో కూడా ప్రతిభ చూపుతున్నది. ఈ మూడు విభాగాల్లో కూడా భారత్ రాణిస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదనేది గణాంకాలు చెబుతున్న సత్యం. ఇకనైనా ఈ క్రీడల్లో మన వీరులు మరింత మెరుగైతే భారత్ కు పతకాల మోతే..
అథ్లెటిక్స్ అధ్వాన్నం..
కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు తొలి స్వర్ణం అందిందే అథ్లెటిక్స్ లో. 440 మీటర్ల పరుగు పందెంలో మిల్కా సింగ్.. 1958లో భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. కానీ ఆ తర్వాత 2010 వరకు మళ్లీ భారత్ ఈ విభాగంలో బంగారు పతకం సాధించలేదు. రజత, కాంస్యాలు అడపాదడపా దక్కుతున్నా మన ఆటగాళ్ల గురి స్వర్ణం మీద ఉండటం లేదు. అథ్లెటిక్స్ లో ఇప్పటివరకు భారత్ సాధించిన బంగారు పతకాలు ఐదు మాత్రమే..
వీటితో పాటు హాకీ, ఆర్చరీ, టెన్నిస్, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ విభాగాల్లో కూడా భారత్ చాలా మెరుగవాల్సి ఉంది. మరి గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న 22వ కామన్వెల్త్ క్రీడలలో మన క్రీడాకారులు ఏ మేరకు మెరుస్తారని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.