భారత్-ఆస్ట్రేలియాల  మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మూడు వన్డేల్లోనూ భారత జట్టు 48.2 ఓవర్లపాటు మాత్రమే బ్యాటింగ్ చేసింది. రెండు సార్లు లక్ష్యచేధనలో...ఓ సారి మొదటి బ్యాటింగ్ చేసిన మూడిట్లోను భారత్ ఖచ్చితంగా ఇలాగే తమ బ్యాటింగ్ ను ముగించింది. అయితే ఇది యాదృచ్చికంగానే జరిగినా వరుస మ్యాచుల్లో ఇలా జరగడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

వన్డే సీరిస్ ఆరంభ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగ్గా అందులో టీమిండియా 236 పరుగుల లక్ష్య చేధనకోసం బరిలోకి దిగింది. ధోని, కేదార్ జాదవ్ బ్యాటింగ్ లో అదరగొట్టి కేవలం 48.2 ఓవర్లకే భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఇక నాగ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ మొదట బ్యాటింగ్ దిగి 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటయ్యింది. అయితే భారత్ ఈ పరుగులను కాపాడుకుని విజయం సాధించింది. ఇక ఇటీవల రాంచీలో జరిగిన మూడో వన్డేలో కూడా భారత్ అదే 48.2 ఓవర్లపాటు మాత్రమే బ్యాటింగ్ చేసింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 281 పరుగులకే ఆలౌటయ్యింది. 

ఇలా మూడు వన్డేల్లోనూ భారత జట్టుకు అదే ముగింపు లభించింది. అయితే మొదటి రెండిట్లో గెలిచినా మూడో దాంట్లో మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఫలితం ఎలాగున్నా 48.2 ఓవర్లకే భారత బ్యాటింగ్ ముగియడం మాత్రం కామన్‌గా మారింది.