స్పోర్ట్స్ డెస్క్: ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా(60) అకాల మృతికి బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే సంతాపం తెలిపారు. గతంలో మైదానంలో ఫుట్ బాల్ ఆడిన తామిద్దరం తప్పకుండా ఏదో ఒకరోజు ఆకాశంలో ఆడతామంటూ భావోద్వేగాని లోనయ్యాడు పీలే. 

''ఇవాళ దుర్వార్త వినాల్సి వచ్చింది. నేను ఓ ప్రియ మిత్రున్ని  మరియు ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఈ విషాదం గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. అతడి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి ఆకాశంలో ఫుట్ బాల్ ఆడతాం'' అంటూ మారడోనా ఫుట్ బాల్ వరల్డ్ కప్ తో వున్న ఫోటోను జతచేస్తూ పీలే ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 

read more  నా హీరో ఇక లేడు: ఫుట్ బాల్ దిగ్గజం మృతిపై గంగూలీ భావోద్వేగం

1986లో అర్జెంటీనాకు మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అందించారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు. అర్జెంటినా జట్టు తరపున ఆడే సమయంలో మారడోనా మెరుపు వేగంతో గోల్స్ కొడుతూ ఫుట్‌బాల్ ఆటలో ‘ది గోల్డెన్ బాయ్’’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించారు మారడోనా 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.  

నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. 1991లో డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురయ్యారు. 1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గాను విధులు నిర్వర్తించారు.