టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరూ చెబుతున్నా... ఈ వార్తలకు మాత్రం పులిస్టాప్ పడటం లేదు. ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్స్ అని... అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు అని ప్రశ్నించారు.

దీనిపై టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. ‘ జట్టులో ఆటకన్నా ఎవరు గొప్పకాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా. అందరం జట్టు కోసం ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా.. ఇన్ని సంవత్సరాలు జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

అయితే... రవిశాస్త్రి చెప్పిన ‘‘ అందరూ జట్టు కోసమే ఆలోచిస్తారు’’ అన్న కామెంట్స్ కి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా స్పందించాడు. ‘‘ తాను జట్టు కోసం కాదు... దేశం కోసం ఆడతాను’’ అంటూ పోస్టు పెట్టి.. తాను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెడుతున్న ఫోటోని ఒకదానిని పోస్టు చేశాడు.

కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ కి రోహిత్ ఈ విధంగా పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నాడు. ఇదిలా ఉంటే... నిజంగా తమ మధ్య విభేదాలు లేకుంటే కోహ్లీ స్పందించిన వెంటనే రోహిత్ కూడా స్పందిచాలి కదా. కానీ ఇప్పటి వరకు రోహిత్ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. పైగా జట్టులో విభేదాలు లేవని రవిశాస్త్రి చెప్పిన వ్యాఖ్యలకు పంచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో విభేదాల వార్త రూమర్ కాదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.