వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇటీవల టీం ఇండియాను సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో అంబటి రాయుడికి చోటు ఇవ్వకపోవడం తనను బాధకు గురిచేసిందని మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నారు. 

‘‘ప్రపంచకప్‌ ఆడే భారత జట్టులో పంత్‌ లేకపోవడంపై నాకు బాధేమీ లేదు. కానీ అంబటి రాయుడు లేకపోవడం చెప్పలేనంత బాధగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. తెలుపు బంతి క్రికెట్‌లో 47 సగటు నమోదు చేసిన 33 ఏళ్ల ఆటగాడి (రాయుడు)ని పక్కన బెట్టడం ఘోరం. సెలక్షన్‌ కమిటీ చేసిన మొత్తం ఎంపిక ప్రక్రియలో ఈ అంశమే నన్ను తీవ్రంగా కలచివేస్తుంది. ’’అని గంభీర్ పేర్కొన్నారు.

‘‘2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో నాకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మెగా ఈవెంట్‌లో ఆడటమనేది ప్రతి క్రికెటర్‌ కల. చిన్నప్పటి నుంచే ప్రతి ఆటగాడు కనే కల ఇదే. ఈ స్వప్నం సాకారం కాకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాయుడి బాధను అర్థం చేసుకోగలను. రాయుడు ఆడినంత మెరుగ్గా, నిలకడగా తెలుపుబంతి క్రికెట్‌ను పంత్‌ ఆడనేలేదు. టెస్టులే ఆడాడు.  పంత్‌కిది ఎదురుదెబ్బ కూడా కాదు. అతను ఇంకా కుర్రాడు. పంత్‌లో ప్రతిభే కాదు వయసూ ఉంది. ఆడే భవిష్యత్తు ఉంది’’ అని పేర్కొన్నారు.