ఇప్పుడంటే భారత్‌లో ఫుట్‌బాల్‌కి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది కానీ ఈ వరల్డ్ ఫేమస్ ఆటకి ఇక్కడ కూడా ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. భారత ఫుట్‌బాల్ జట్టు1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా వెళ్లింది కూడా.  అయితే ఆ తర్వాత భారత ఫుట్‌బాల్ ఆటతీరు దిగజారడంతో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిఫా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించలేకపోయింది.

1956లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు, ఆతిథ్య ఆస్ట్రేలియానే ఓడించి సెమీస్ చేరింది. అప్పటి జట్టులో ఐదుగురు క్రీడాకారులు హైదరాబాద్ సిటీ పోలీసులేనట. ఈ విషయాన్ని గర్వంగా ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఆనాటి ఫోటోను పోస్టు చేశారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

‘అద్భుతమైన క్షణాలు: 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ చేరింది. ఆ జట్టులో హైదరాబాద్ సిటీకి చెందిన ఐదుగురు పోలీసులు ఉన్నారు. షేక్ అజీజుద్దీన్, అహ్మద్ హుస్సేన్, నూర్ మహ్మద్, బలరాం, మహ్మద్ జుల్ఫీకరుద్దీన్. వారికి నా సెల్యూట్...’ అంటూ ట్వీట్ చేశారు అంజనీ కుమార్.

భారత ఖ్యాతిని ప్రపంచవేదికపై రెపరెపలాడించిన ఆనాటి క్రీడాకారులు, భాగ్యనగర పోలీసుల గురించి తెలియచేసినందుకు సీపీ అంజనీకుమార్‌కి ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు హైదరాబాద్ నగరవాసులు. వీరిని ఆదర్శంగా తీసుకుని భారత ఫుట్‌బాల్ జట్టు ఆటతీరు మెరుగవ్వాలని కోరుకుంటున్నారు.