హైదరాబాద్: భర్త, అత్తింటివారు తనను వేధిస్తున్నారని జాతీయ స్కేటింగ్ చాంపియన్ రుచిక జైన్ హైదరాబాదులోని బేగంపేట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వేధించడమే కాకుండా తన భర్త తనను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. 

తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించారు. ఆ మహిళకు సంబంధించిన ఫొటోలను ఆమె చూపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. 

స్కేటింగ్ రుచిక జైన్ స్వర్ణపతకం గెలుచుకుంది. పలు టోర్నమెంట్లలో విజేతగా నిలిచంిది. నిరుడు డిసెంబర్ 11వ తేదీన వివాహం జరిగిన మరుక్షణం నుంచి సమస్య ప్రారంభమైందని ఆమె చెప్పింది. తన భర్త తనను హానీమూన్ కు తీసుకుని వెళ్లకపోవడంతో ఘర్షణ మొదలైనట్లు తెలిపింది. 

పెళ్లి జరిగిన నాటి నుంచే తనకు భర్త అక్షయ్ దూరంగా ఉంటూ వచ్చాడని, రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లి మర్నాడు తెల్లవారుజామను తిరిగి వచ్చేవాడని ఆమె చెప్పింది. తాను అక్షయ్ ఫోన్ ను చెక్ చేశానని, అతను వాట్సప్ లో మరో మహిళతో నిరంతరాయంగా చాట్ చేయడం గమనించానని చెప్పింది. 

అక్షయ్ వివాహేతర సంబంధం గురించి చెప్పడంతో తన అత్తింటివారు తనను వేధిస్తూ వచ్చారని ఆమె ఆరోపించింది. తన భర్త వివాహేతర సంబంధంపై తన భర్త, అత్తింటివారి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వచ్చారని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.