భారత సంచలన స్పింటర్ హిమదాస్ కు అరుదైన అవకాశం లభించింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్  లో భారత్ తరపున పాల్గోనే అరుదైన అవకాశాన్ని ఆమె పొందారు. భారత్ తరపున ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గోనే ఆటగాళ్ల జాబితాలో హిమదాస్ కు చోటుదక్కించుకుంది. ఆమెతో పాటు మరో 24 మంది ఆటగాళ్ల జాబితాను భారత అథ్లెటిక్స్  సమాఖ్య(ఏఎఫ్ఐ) తాజాగా ప్రకటించింది. 

ఈనెల 27 నుంచి అక్టోబరు 6 వరకు దోహాలో వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఇందులో హిమదాస్ మహిళల 4x400,మిక్స్‌డ్ 4x400మీటర్ల రిలే విభాగంలో పాల్గొననుంది. ఈ విభాగంలో భారత్ పక్కా పతకాలను సాధిస్తుందన్న నమ్మకాన్ని ఏఎఫ్‌ఐ వ్యక్తం చేస్తోంది. 

ఇప్పటికే హిమదాస్ అంతర్జాతీయ వేదికలపై కేవలం మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించింది. ఇలా భారత కీర్లిపతాకాన్ని విదేశాల్లో రెపరెపలాడించిన ఆమెపై యావత్ దేశం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రపతి, ప్రధానుల నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు హిమదాస్ ను అభినందించకుండా వుండలేకపోయారు. పేదరికాన్ని జయించి ఈ స్థాయికి చేరుకున్న ఆమె ఇపుడు దేశ యువతకు ఆదర్శంగా నిలిచారు.  

వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో  హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గింది.  పథకాన్ని అందుకునే సమయంలో ఆమె భావోద్వేగాలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ఓ వైపు జనగణమన ఆలపిస్తూ.. మరోవైపు కన్నీటిపర్యంతమైన ఆమెను చూసి ప్రతిఒక్కరూ విజయగర్వాన్ని మరియు బాధను ఒకేసారి అనుభవించారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హిమదాస్ కు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రూపంలో మరోసారి సత్తాచాటే అవకాశం లభించింది.