Asianet News TeluguAsianet News Telugu

నీరజ్ చోప్రా ఒలింపిక్ స్వర్ణంపై జర్మనీలో సంబురాలు

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా విజయాన్ని జర్మనీలోని రెండు గ్రామాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. నీరజ్ చోప్రా విజయం వెనుకున్న డాక్టర్ క్లాస్ బార్టనిజ్, ఇండియా జావెలిన్ హెడ్ కోచ్ ఉవ్ హాన్‌లు జర్మనీలోని తమ స్వస్థలానికి చేరగానే ఇరువురినీ స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఫోన్ కాల్స్, వ్యక్తిగతంగా అభినందనలు వెల్లువెత్తాయి. నీరజ్ చోప్రా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయినట్టు వారు వివరించారు.

germany villages celebrated neeraj chopra's olymping   succes
Author
New Delhi, First Published Aug 14, 2021, 4:11 PM IST

న్యూఢిల్లీ: భారత్‌లో టోక్యో ఒలింపిక్స్ గురించి మాట్లాడినవారంతా ఇప్పుడు కచ్చితంగా స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా గురించి చర్చించే తీరుతారు. 130 కోట్ల మంది గర్వపడ్డ క్షణాలు, టోక్యో పోడియంలో భారత జాతీయ గీతాలపన అందరి మదిలో నిలిచిపోతాయి. స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. సన్మాన కార్యక్రమాలు, జర్నలిస్టులు ఇంటర్వ్యూలు మొదలు హడావిడి సాగింది. దేశమంతటా నీరజ్ చోప్రా గోల్డ్ గెలవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది. కేవలం ఇండియానే కాదు, జర్మనీలోనూ నీరజ్ గెలుపుపై సంబురాలు జరిగాయి.

జర్మనీలోని రెండు ఊళ్లలో ఈ సంతోష సంబురాలు కనిపించాయి. ఇందుకు కారణంగా నీరజ్ చోప్రా విజయం వెనుకున్న డాక్టర్ క్లాస్ బార్టనిజ్, ఇండియా జావెలిన్ హెడ్ కోచ్ ఉవ్ హాన్‌లున్నారు. వీరిరువురూ జర్మనీకి చెందినవారే.

నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్నా జర్మనీలోని స్వగ్రామానికి చేరిన క్లాస్ బార్టనిజ్‌పై గ్రామస్థుల నుంచి ప్రశంసలు కురిశాయి. స్వగ్రామానికి చేరగానే ఇతర క్రీడాకారులు, సాధారణ గ్రామీణులు క్లాస్ చుట్టూ మూగారు. నీరజ్ చోప్రా గురించి చర్చలు చేశారు. చోప్రా గురించి క్లాస్‌ను అడిగి తెలుసుకున్నారు. వారంతా జావెలిన్ త్రో ఫైనల్స్ చూశారు. అందులో చోప్రా జావెలిన్‌ను విసిరేశాక దాన్ని చూడకుండానే కచ్చితంగా చాలా దూరమే చేరుతుందన్న ఆత్మవిశ్వాసంతో చేతులు పైకెత్తి అభివాదం చేయడాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసినట్టు క్లాస్ మీడియాకు తెలిపారు. తనకు అన్ని ఫోన్ కాల్స్ ఎన్నడూ రాలేదని, చుట్టూ అంతమంది చేరి పొగడ్తల్లో ముంచడమూ ఇదే తొలిసారి అని నీరజ్ చోప్రా గురించి గర్వంగా చెప్పుకొచ్చారు.

ఇండియా హెడ్ కోచ్ ఉవ్ హాన్ పరిస్థితి ఇదే. హాన్ నివసించే పట్టణం రీన్స్‌బర్గ్‌లో నీరజ్ చోప్రానే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిందని వివరించారు. నీరజ్ చోప్రా గురించి, ఒలింపిక్స్‌లో ఆయన ప్రదర్శన గురించి కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినట్టు హాన్ చెప్పారు. నీరజ్ చోప్రా తొలినాళ్ల నుంచి హాన్ శిక్షణ ఇస్తున్నారు. పరిణతిగల క్రీడాకారుడిగా ఎదగడంలో ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో ట్రోఫీలు గెలుచుకోవడంలో చోప్రాకు ఆయన శిక్షణనిచ్చారు. ఈ తరపు గొప్ప జావెలిన్ త్రోయర్‌గా హాన్‌ను పేర్కొంటుంటారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం ఏడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించారు. అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు పసిడి పతకాన్ని తెచ్చారు. స్వర్ణ పతక ప్రదర్శనతో ఆయన వరల్డ్ ర్యాంకింగ్ కూడా మెరుగైంది. ఒలింపిక్స్‌కు వెళ్లకముందు 16వ స్థానంలో ఉన్న చోప్రా తాజాగా రెండో ర్యాంక్‌కు ఎగబాకడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios