టీం ఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ వార్తలపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ధోనీ తన కెరిర్ చివరి దశకు చేరుకున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధోనీ ఉద్వేగానికి లోను కాకుండా... సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

ధోనీ ఎప్పుడు సీనియర్స్ కి కాకుండా యువకులకు ఎక్కువ ఛాన్సులు ఇచ్చేవాడని గుర్తు చేశారు. ఇప్పుడు ధోనీ వంతు వచ్చిందంటూ ఇన్ డైరెక్ట్ గా రిటైర్ అవ్వమని సలహా ఇచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్ లో సెహ్వాగ్, సచిన్ లతోపాటు తనను కూడా ధోనీ పక్కన పెట్టేశాడన్న విషయాన్ని ఈ సందర్భంగా గంభీర్ గుర్తు చేశారు. 

తదుపరి ప్రపంచకప్ కోసం అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ను సిద్ధం చేయాల్సిన అసవరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ ముగ్గురిలో ఒక్కొక్కరికీ సంవత్సరంన్నర పాటు అవకాశం ఇచ్చి... ఎవరు బాగా ఆడితే వాళ్లకు అవకాశం ఇవ్వాలని గంభీర్ తెలిపారు. 

ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ గెలిస్తే క్రెడిట్ అంతా ధోనీకే ఇవ్వడం... ఓడితే అందరూ అతనినే నిందించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.