CWG 2022: వనిత.. నీదే ఈ ఘనత.. విశ్వవేదికపై సత్తా చాటిన మన మగువలు

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శనే చేశారు. ముఖ్యంగా  మహిళా  క్రీడాకారులు తమ  అసమాన ప్రదర్శనలతో శభాష్ అనిపించుకున్నారు. 

From Mirabhai Chanu To PV Sindhu, check out India's Women medal Winners

‘ఆకాశంలో సగం’ అని కీర్తించబడుతున్నా దేశంలో ఇంకా మహిళలను వంటింటి కుందేళ్లుగా చూస్తున్న సమాజం మనది. పురుషాధిక్య సమాజంలో సమానత్వం సంగతి దేవుడెరుగు.. కనీసం వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినా అద్భుతాలు చేయగలమని నిరూపిస్తున్నారు మన మగువలు. సోమవారం ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత్ సాధించిన  పతకాలలో సగం మన వనితలు సాధించినవే.  తాము పురుషులతో సమానమని విశ్వ వేదికపై ఎలుగెత్తి చాటారు వనితలు. ఈ పోటీలలో విజయాలు సాధించి  పతకాలు గెలిచినవారిలో   పలువురి క్రీడాకారుల నేపథ్యాలు స్ఫూర్తిదాయకం.

కామన్వెల్త్ క్రీడలలో భారత్ మొత్తం 61  పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యలున్నాయి. అయితే భారత్ సాధించిన పతకాలలో సగం (31) మహిళలు సాధించినవే కావడం గమనార్హం. 

కామన్వెల్త్ క్రీడలు-2022లో భాగంగా భారత్‌కు తొలి స్వర్ణం అందించింది మీరాబాయి చాను. మీరాబాయిది నిరూపేద కుటుంబమే. వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకునేందుకుగాను నిత్యం  వందలాది కిలోమీటర్లు ప్రయాణించేది. ఆర్థిక కష్టాలకు ఎదురొడ్డి పోరాడింది. మరో వెయిట్ లిఫ్టర్ లాల్రిన్నుంగది కూడా పేద కుటుంబమే.

నాన్న చనిపోయాడు.. అమ్మే సర్వస్వం.. 

జూడో క్రీడాకారిణి తులిక మాన్ ఈ పోటీలలో రజతం గెలిచింది. స్వర్ణం కోసం పోరాడినా ఆమె రజతం  సొంతం చేసుకుంది.  ఆమె తల్లి తులిక మాన్ మూడేండ్ల వయసు ఉన్నప్పుడే భర్త పెట్టే బాధలు భరించలేక ఇల్లు విడిచి ఢిల్లీకి వచ్చింది. పోలీస్ గా ఉద్యోగం తెచ్చుకుని కూతురుని క్రీడాకారిణిగా చేసింది. చిన్నప్పట్నుంచే తులిక.. తన తండ్రి చనిపోయాడని చెప్పేదే తప్ప తననుంచి దూరంగా ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. అతడు 2005లో నిజంగానే చనిపోయాడు. అంతకుముందే వాళ్ల జీవితం నుంచి ఆ తండ్రిని తీసేశారు. అమ్మ తనకోసం పడ్డ కష్టాన్ని తులిక మరవలేదు. స్వర్ణం తీసుకొస్తానని తల్లికి చెప్పినా ఆమె తర్వాత రజతం  గెలిచినందుకు బాధపడింది. కానీ తన లక్ష్యం ఒలింపిక్స్ లో  స్వర్ణం గెలవడమే అని చెప్పింది. జూడోలోనే సుశీల దేవి కూడా  తృటిలో స్వర్ణం కోల్పోయింది. 

నలుగురు మహిళలు.. ఒక లక్ష్యం 

లవ్లీ చౌబే, పింకి, నయన్మోనీ సైకియ, రూపారాణి..  ఈ నలుగురు ఎంచుకున్న ఆటలాగే వీళ్ల పేర్లు కూడా అంతగా తెలియవు మనకు. లాన్ బౌల్స్.. అసలు ఈ ఆట ఒకటి ఉందని కూడా భారత్ లో చాలా మందికి తెలిసింది ఇప్పుడే. కానీ పైన పేర్కొన్న నలుగురు మాత్రం ఈ ఆటలో స్వర్ణం నెగ్గారు. వీళ్లేం యువ క్రీడాకారులు కాదు. వీరిలో ఇద్దరు నలభై దాటగా మరో ఇద్దరి వయసు 34 ఏండ్లు దాటింది. 

రెజ్లర్ల హవా.. 

ఈ పోటీలలో భారత్ కు అత్యధిక పతకాలు వచ్చిన క్రీడాంశంంలో రెజ్లింగ్ ఒకటి.  ఈ క్రీడలో భారత్ కు ఏకంగా 12 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు దక్కాయి.  బంగారు పతకం సాధించినవారిలో సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ లు ఉన్నారు. అన్షు మాలిక్ రజతం నెగ్గగా పూజా గెహ్లాట్  కాంస్యం నెగ్గింది. 

బాక్సర్ల జోరు.. 

ఒకప్పుడు భారత బాక్సింగ్ అంటే మేరీ కోమ్. కానీ ఈ క్రీడలలో ఆమె గాయం కారణంగా పోటీ పడలేదు. కానీ ఆ లోటును పూరించడానికి మేమున్నామంటూ దూసుకొచ్చారు  నీతూ ఘంఘాస్, నిఖత్ జరీన్ లు.  వీళ్ల ప్రయాణమేమీ నల్లేరుపై నడకలా సాగలేదు. బాక్సింగ్ రింగ్ లో పోటీ కంటే కట్టుబాట్ల బౌట్‌లను దాటాల్సి వస్తోంది నిఖత్ జరీన్‌కు. ఎన్నో అవమానాలను భరించి  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ తో పాటు కామన్వెల్త్ లో స్వర్ణం నెగ్గింది. 

వీరితో పాటు పీవీ సింధు, ఆకుల శ్రీజ, సుశీలా దేవి, భారత హాకీ, క్రికెట్ జట్ల మహిళలు సైతం ఆంగ్లేయుల గడ్డమీద మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు.  

‘స్వర్ణ’కాంతులు  తెచ్చిన మహిళలు : 

- మీరాబాయి చాను - వెయిట్ లిఫ్టింగ్ 
- జెరెమీ లాల్రిన్నుంగ - వెయిట్ లిఫ్టింగ్ 
- లవ్లీ చౌబే, పింకి, నయన్‌మోనీ  సైకియ,  రూపా రాణి - లాన్ బౌల్స్ 
- వినేశ్ పోగట్ - రెజ్లింగ్ 
- సాక్షి మాలిక్ - రెజ్లింగ్
- నీతూ ఘంఘాస్ - బాక్సింగ్
- నిఖత్ జరీన్ -  బాక్సింగ్
- పీవీ సింధు - బ్యాడ్మింటన్ 
- ఆకుల శ్రీజ - టేబుల్ టెన్నిస్ 
- భవీనా పటేల్  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios