Asianet News TeluguAsianet News Telugu

రూపాయికి ఒక వడ్ల బస్తా మోసిన ఆ చేతులే భారత్‌కు స్వర్ణాన్ని అందించాయి.. ఎవరీ అచింత షెవులి..?

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిటిలిఫ్టింగ్ పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షెవులి స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. ఈ పోటీలలో భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన మూడో వెయిట్ లిఫ్టర్ అయ్యాడు. 

From Embroidery Works and Daily Labour to CWG 2022 Gold Winner, Who is Achinta Sheuli? Check Interesting Details About Him
Author
India, First Published Aug 1, 2022, 11:39 AM IST

వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో అచింత షెవులి స్వర్ణ పతకంతో ఈ క్రీడలలో భారత్ కు పతకాల సంఖ్యను ఆరుకు పెంచాడు. 73 కిలోల విభాగంలో పోటీ పడ్డ అతడు..  ఏకంగా 313 కిలోల బరువును ఎత్తాడు.  కామన్వెల్త్ క్రీడలలో  భారత మువ్వన్నెల పతాకాన్ని మరోసారి  సగర్వంగా రెపరెపలాడించిన షెవులి జీవితమేమీ పూలపాన్పు కాదు. సాధారణ గ్రామీణ భారతీయ పేద కుటుంబం పడాల్సిన కష్టాలన్నీ పడ్డాడు. చిన్నప్పుడే నాన్న చనిపోతే అన్నతో కలిసి దినసరి కూలీగా మారాడు. అమ్మ టైలరింగ్ పని చేస్తే కుట్లు అల్లికలు పని నేర్చుకున్నాడు. వడ్ల బస్తాలూ మోశాడు. బెంగాల్  లోని ఓ కుగ్రామం నుంచి బర్మింగ్‌హోమ్ విజేతగా షువెలి ఎలా ఎదిగాడు అనేది ఆసక్తికరం. 

పశ్చిమబెంగాల్ లోని డియోల్పూర్ అచింత స్వగ్రామం. హౌరా నుంచి రెండు గంటల ప్రయాణం. అచింత తండ్రి దినసరి కూలీ. తల్లీ అంతే. అన్న, తను. ఇదీ అతడి కుటుంబం. 2014లో అచింత తండ్రి చనిపోయాడు.  అప్పటికీ అతడి వయసు 13 ఏండ్లు. 

తండ్రి దహన సంస్కారాలకు డబ్బులేక.. 

అచింతకు ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోయాడు. అప్పటికీ నిప్పుల కుంపటి మీద ఉన్న జీవితాలు.. ఆ ఘటనతో మరింత చితికిపోయాయి. తండ్రికి దహన సంస్కారాలు చేద్దామన్నా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇరుగుపొరుగు వాళ్లు కొంత సాయం చేస్తే ఆ కార్యక్రమం పూర్తి చేశారు.  

అన్న కల ఆవిరి.. రోడ్డున పడ్డ కుటుంబం.. 

అచింత అన్నకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. వాస్తవానికి అతడే వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు. కానీ కాలం మరో కథ రాసింది. తండ్రి చనిపోవడంతో అప్పటికే  యువకుడిగా ఉన్న అలోక్ చదువు మానేశాడు. ఊళ్లో దినసరి కూలీగా మారాడు. తల్లి టైలరింగ్ పని నేర్చుకుంది. కుటుంబ పరిస్థితి తెలిసిన అచింత చిన్న వయసులోనే కుటుంబానికి చేదోడువాదోడుగా మెలిగాడు. అన్నతో కలిసి పనులకు వెళ్లేవాడు. అన్నా తమ్ముళ్లు కలిసి ఊళ్లో వడ్ల బస్తాలు మోసేందుకు వెళ్లేవారు.  ఒక్క బస్తా మోస్తే ఒక రూపాయి. నేడు 300 కిలోల బరువును ఎత్తిన ఆ చేతులు.. గతంలోనే క్వింటాళ్లకు క్వింటాళ్ల వడ్ల బస్తాలు మోశాయి. ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుంటే రోజంతా బస్తాలు మోశాక  సాయంత్రం చికెన్ కూరతో భోజనం పెట్టేవారు.

పని నుంచి సాయంత్రం ఇంటికి రాగానే అమ్మకు కోల్కతా నుంచి వచ్చే కుట్లు, అల్లికలు (ఎంబ్రాయిడరీ వర్క్స్) పనిలో సాయం చేసేవారు. అంతా  చేస్తే వారానికి వారు సంపాదించే ఆదాయం వారానికి రూ. 1,200. ఒక్కోసారి అవి కూడా వచ్చేవి కావు.  పొద్దంగా పనిచేస్తే వచ్చిన ఆదాయంతోనే ఆరోజు ఇల్లు గడిచేది. ఒక్కోసారి వారానికి ఒకమారు డబ్బులు ఇచ్చేవారు. దాంతో వారం బతుకు బండి గడిచేది. అన్నాతమ్ములిద్దరూ ఇదే పని చేయాలని నియమమేమీ పెట్టుకోలేదు. వాళ్ల కడుపు నింపే పనేదైనా సరే.. చేసేశారు. 

 

రూట్ మార్చిన అలోక్.. 

అలోక్ చదువు మానేసినా తమ్ముడిని మాత్రం బడి మాన్పించలేదు. చిన్నప్పట్నుంచే తనతో పాటు తమ్ముడికి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో  ఇంటిదగ్గరే శిక్షణ ఇప్పించిన అలోక్.. తమ్ముడు స్కూల్, మండల, జిల్లా స్థాయిలలో పతకాలు తీసుకువస్తుంటే అతడు ఇక్కడే ఆగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. దినసరి కూలీ, ఎంబ్రాయిడరీ వర్క్స్ తో పని అవదని కోల్కతాకు మకాం మార్చాడు. అక్కడ ఓ వేర్ హౌజింగ్ సంస్థలో పనికి కుదిరాడు. పొద్దున 8 నుంచి సాయంత్రం 6 వరకు పని. ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు కష్టం.  అయినా తమ్ముడి కోసం భరించాడు. అన్న కష్టం చూసిన అచింత  దర్జాగా కూర్చోని తినలేదు. పొద్దున్నే లేవగానే ఇంట్లో పని, శిక్షణ, బడి, శిక్షణ, పని.. ఇలా ముగిసేది అతడి రోజు.. 

అక్కడే కీలక మలుపు.. 

2014లో నేషనల్ ఛాంపియన్స్ లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ యూత్ కేటగిరీలో పాల్గొన్న అచింత.. నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే అతడి ప్రతిభను గుర్తించిన కోచ్ అస్టోమ్ దాస్.. అచింతను పూణెలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్ఐ)కు తీసుకెళ్లాడు. అక్కడ అచింత జీవితం మరో మలుపు తిరిగింది. రోజుకు మూడు పూటలు తిండి దొరికింది. శిక్షణ కూడా అందింది. అప్పుడు పూర్తిగా అతడికి ‘ఆట మీద దృష్టి’ మళ్లింది. 

పతకాల వేట ప్రారంభం.. 

ఏఎస్ఐలో రాటుదేలిన అచింత.. 2018లో ఆసియన్ యూత్ ఛాంపియన్షిప్స్ లో  సిల్వర్ గెలిచాడు. ఇక 2019లో కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ తో పాటు 2021లో అతడు చరిత్ర సృష్టించాడు. గతేడాది జరిగిన  జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలలో భాగంగా అతడు రజతం నెగ్గాడు. పతకాల వేట ప్రారంభమయ్యాక అచింత  వెనుదిరిగి చూసుకోలేదు..

కుటుంబమూ కుదుటపడుతోంది.. 

షెవులి పతకాలు నెగ్గడం  ప్రారంభమయ్యాక గుర్తింపుతో పాటు అతడికి జీవితం మీద ‘భద్రత’ కూడా లభించింది. ఖేలో ఇండియా గేమ్స్ లో స్వర్ణం సాధించాక అతడికి భారత  ఆర్మీలో హవిల్దార్ గా ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 10వేల స్టైఫండ్ కూడా లభించింది. షెవులి ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నది కూడా మూడేండ్ల కిందటే.. ఇంతవరకూ అతడు దానిని మార్చలేదు. షెవులి అంతో ఇంతో సంపాదిస్తుండటంతో తన తల్లి టైలరింగ్ మానేసింది. అన్న కూడా  తన ‘పాత లక్ష్యం’ కోసం మళ్లీ సాధన మొదలుపెట్టాడు.  

 

అన్నకే అంకితం.. 

కామన్వెల్త్ లో స్వర్ణం నెగ్గాక షెవులి తన పతకాన్ని అన్నకు అంకితమిచ్చాడు. తన అన్నవల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios