Asianet News TeluguAsianet News Telugu

ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖాసింగ్ ఇక లేరు...

భారత మేటి స్ప్రింటర్, ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖాసింగ్ ఇకలేరు. కరోనా వైరస్ కాంప్లికేషన్స్ వల్ల శుక్రవారం అర్థరాత్రి ఆయన చండీగఢ్ లో కన్నుమూశారు.

Flying sikh Milkha Singh No more, passes away at 91 due to post covid complications
Author
Chandigarh, First Published Jun 19, 2021, 1:35 AM IST

భారత మేటి స్ప్రింటర్, ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖాసింగ్ ఇకలేరు. కరోనా వైరస్ కాంప్లికేషన్స్ వల్ల శుక్రవారం అర్థరాత్రి ఆయన చండీగఢ్ లో కన్నుమూశారు. గత వారమే ఇదే మహమ్మారి వల్ల మిల్ఖాసింగ్ భార్య కన్నుమూశారు. ఈ విషాద సంఘటన జరిగిన వారంలోపే ఆయన కూడా మరణించారు. 

గురువారం రాత్రి నుంచే జ్వరం తీవ్రతరమవడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండడంతో ఆయనను డాక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం అర్థరాత్రి ఆయన కన్నుమూశారు. బుధవారం రోజే ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో జనరల్ ఐసీయూ వార్డులోకి మార్చారు. ఒక్కరోజులోనే ఆయనకు అకస్మాత్తుగా జ్వరం రావడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం మొదలయ్యాయి. దీనితో ఆయన శుక్రవారం అర్థరాత్రి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

మిల్ఖాసింగ్ మరణవార్త విని ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కొన్ని రోజులకిందే మిల్ఖాసింగ్ తో మాట్లాడానని, ఆ మాటలే చివరి మాటలవుతాయని అనుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. 

ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారతీయ అథ్లెట్లలో మేటి మిల్ఖాసింగ్. ఏషియన్ గేమ్స్ లో నాలుగు స్వర్ణాలు, కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణంతో ప్రపంచ క్రీడా యవనికపై భారతదేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించాడు. రోమ్ ఒలింపిక్స్ లో వెంట్రుకవాసిలో పతకాన్ని చేజార్చుకొని నాలుగవ స్థానంలో నిలిచాడు. 1960లో సింగ్ నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టడానికి 38 సంవత్సరాలు పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు... మిల్ఖాసింగ్ ని ఫ్లయింగ్ సిఖ్ అని ఎందుకు పిలిచేవారో..! మిల్ఖాసింగ్ ని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 

విభజనకు ముందు ప్రస్తుత పాకిస్థాన్ లోని గోవింద్ పురాలో జన్మించిన మిల్ఖాసింగ్...  91 ఏండ్ల వయసులోనూ రోజు గోల్ఫ్ ఆడడం, లేదా 2 కిలోమీటర్లు జాగింగ్ చేయడం మిల్ఖాసింగ్ దినచర్యలో భాగం. ఈ వయసులోనూ ఇంత ఫిట్ గా ఉండి దేశంలోని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మిల్ఖాసింగ్ కి ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు. కొడుకు జీవ్ మిల్ఖాసింగ్ కూడా ఆటగాడే. 14 సార్లు  ఇంటర్నేషనల్నే గోల్ఫ్ ఛాంపియన్. తండ్రి లాగే అతను కూడా పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios