ఫిఫా వరల్డ్ కప్ 2022: ప్రపంచమంతా పిచ్చి క్రేజ్... మరి ఈ ఫుట్‌బాల్ మనకెందుకు ఎక్కడం లేదు...
ఫిఫా వరల్డ్ కప్‌ని పట్టించుకోని భారతీయులు... ఇండియాలో ఫుట్‌బాల్ మ్యాచులకు దక్కని టీఆర్పీ... కేరళతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని నగరాలకి మాత్రమే పరిమితమైన ఫిఫా ఫివర్...
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. ఖతర్‌లో జరుగుతున్న ఈ సాకర్ ఆటను చూసేందుకు కొందరు అభిమానులు, వేల కిలో మీటర్లు ప్రయాణించి ఏడారి దేశానికి చేరుకుంటున్నారు.ఇప్పటికే 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా మిగిలిన టికెట్లకు బీభత్సమైన డిమాండ్ ఏర్పడింది...
అయితే ప్రపంచమంతా ఫుట్‌బాల్ పిచ్చిలో పడిలేస్తున్నా, భారత్‌లో మాత్రం చడీచప్పుడు లేదు. ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ మరో ఆటకు ఉండదు. అందుకే ఏడాదిలో రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఆరంభంలో ప్రో కబడ్డీ మ్యాచులకు మంచి ఆదరణ దక్కినా, ఇప్పుడు ఆ మ్యాచులను కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు...
భారత్‌లో ఫుట్‌బాల్‌కి క్రేజ్ తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇండియన్ సూపర్ లీగ్ పేరుతో ఓ ఫుట్‌బాల్ లీగ్‌ని కూడా తీసుకొచ్చారు. అయితే అది కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కేరళ రాష్ట్రంలో మాత్రం ఫుట్‌బాల్‌కి మంచి క్రేజ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో మాత్రమే ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కనిపిస్తారు. ఎందుకు... ప్రపంచాన్ని ఊర్రూతలూగించే ఫుట్‌బాల్, మన ప్రజలకు ఎందుకు ఎక్కడం లేదు...
ఇప్పుడంటే భారత్‌లో ఫుట్‌బాల్‌కి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది కానీ ఈ వరల్డ్ ఫేమస్ ఆటకి ఇక్కడ కూడా ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. భారత ఫుట్‌బాల్ జట్టు 1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా వెళ్లింది కూడా.
1956లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు, ఆతిథ్య ఆస్ట్రేలియానే ఓడించి సెమీస్ చేరింది. అప్పటి జట్టులో ఐదుగురు క్రీడాకారులు హైదరాబాద్ సిటీ పోలీసులే. 1960 దశాబ్దం తర్వాత భారత ఫుట్‌బాల్ ఆటతీరు దిగజారడంతో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిఫా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించలేకపోయింది.
మనకి చేతకానప్పుడు ఏదైనా పనికి రానిదే... మనవాళ్లు లేనప్పుడు దానికి ఎంత క్రేజ్ ఉన్నా మనకి అక్కర్లే! ఫుట్‌బాల్‌కి క్రేజ్ రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ గురించే చాలా మందికి తెలీదు. దురంద్ కప్ టైటిల్ బహుకరణ సమయంలో ఫుట్‌బాల్ కెప్టెన్‌నే పక్కనే తోసేశాడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గణేశన్...
గవర్నర్ పొజిషన్ అనుభవిస్తున్న వ్యక్తికే మన ఫుట్‌బాల్ కెప్టెన్ గురించి, అతను సాధించిన ఖ్యాతి గురించి తెలియనప్పుడు సాధారణ జనాలకు ఎలా తెలుస్తుంది. అదీకాకుండా భారతీయులకు ఫుట్‌బాల్ ఎందుకు ఎక్కలేదు? అనే దాని గురించి ఓ థియరీ కూడా ప్రచారంలో ఉంది...
ప్రతీ వస్తువుని గౌరవించడం భారతీయుల సంప్రదాయం. చేతిలో ఉన్న పుస్తకం కిందపడినా పైకి తీసి మొక్కుతారు. పొరపాటున కాలు తగిలితే, తప్పు అయ్యిందంటూ చెంపలేసుకుంటారు. అలాంటి భారతీయులు కాలితో బంతిని తన్నే ఫుట్‌బాల్‌ని ఇష్టపడకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని నానుడి.. ఐపీఎల్ ఆడే 10 ఫ్రాంఛైజీల్లో రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్ల వివరాలు చెప్పే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్న ఈ దేశంలో... చాలామందికి కూడా మెస్సీ, రొనాల్డో తప్ప మరో ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు కూడా తెలియకపోవడం కొసమెరుపు...