ఫిఫా వరల్డ్ కప్ 2022: లైవ్‌లో రిపోర్టర్ పర్సు కొట్టేసిన దొంగలు! ఆ టీషర్ట్ వేసుకున్నాడని జర్నలిస్టుకి..
FIFA World cup 2022: లైవ్ టెలికాస్ట్ ఇస్తుండగా అర్జెంటీనా మహిళా రిపోర్టర్ పర్సు కొట్టేసిన దొంగలు... రెయిన్‌బో టీ షర్ట్ వేసుకున్నాడని స్టేడియంలోకి వెళ్లకుండా యూఎస్ జర్నలిస్టును అడ్డుకున్న అధికారులు...
వెస్ట్రరన్ కంట్రీస్‌లో ఫిఫా వరల్డ్ కప్ జరిగితే... కాల్పులు జరిగినా అది పెద్ద న్యూస్ కాదు. అదే ఆసియాలో, అందులోనూ ఓ ఇస్లామిక్ కంట్రీలో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుండడాన్ని ఓర్వలేకపోతున్నాయి ఈశాన్య దేశాలు. ఖతర్‌లో జరుగుతున్న చిన్న చిన్న విషయాలను భూతద్ధంలో పెట్టి చూపిస్తూ, అక్కడేదో జరగరానిదేదో జరిగిపోతుందని తెగ ఊదరకొడుతున్నాయి...
ఖతర్‌లో మహిళల వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అలాగే ఎల్‌జీబీటీ కమ్యూనిటీ (స్వలింగ సంపర్కులు)కి ఇక్కడికి ప్రవేశం లేదు. ఎల్‌జీబీటీ హక్కుల గురించి మాట్లాడినా, వారికి మద్ధతుగా నిలిచినా జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా ఓ అమెరికా జర్నలిస్ట్... ఎల్‌జీబీటీ జెండాని ముద్రించిన టీ షర్టుతో ఫిఫా వరల్డ్ కప్‌కి వచ్చాడు...
ఖతర్‌లో వరల్డ్ కప్ స్టేడియంలోకి వెళ్తున్న సమయంలో అతన్ని గుర్తించిన అధికారులు, రెయిన్ బో టీషర్లు వేసుకున్నందుకు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రాంట్ వాహ్ అనే సదరు యూఎస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, తన సొంత వెబ్‌సైట్‌లో దీని గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్ రయ్యన్‌లో ఉన్న అహ్మద్ బిన్ ఆలీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు తాను వెళ్లానని, అయితే తాను వేసుకున్న టీషర్టుని విప్పితేనే లోపలికి అనుమతిస్తామని అక్కడి అధికారులు చెప్పినట్టు రాసుకొచ్చాడు గ్రాంట్...
ఈ సంఘటన గురించి ట్వీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, బలవంతంగా తన ఫోన్ లాక్కున్నారని ఆరోపించాడు గ్రాంట్. కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ కమాండర్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పి, లోపలికి అనుమతించాడని పేర్కొన్నాడు సదరు యూఎస్ జర్నలిస్ట్. అడ్డుకున్నందుకు ఫిఫా, సాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ కూడా తనకు క్షమాపణలు కోరినట్టు రాసుకొచ్చాడు గ్రాంట్...
మరో సంఘనలో దోహాలో వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను కవర్ చేస్తున్న అర్జెంటీనా టీవీ రిపోర్టర్ పర్సు చోరీకి గురైంది. మెట్జ్‌గర్ అనే మహిళా రిపోర్టర్, ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులను కవర్ చేసేందుకు ఖతర్ చేరుకుంది. దోహాలో ఫిఫా ఆరంభ వేడుకల గురించి చెబుతున్న సమయంలో తన చుట్టు గుమిగూడిన కొందరు జనాలు, తన పర్సును దొంగిలించారని ఆరోపించింది.
ఆ పర్సులో డబ్బుతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని తెలిపింది ఆ టీవీ రిపోర్టర్. లైవ్ జరుగుతున్న సమయంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌తో కలిసి డ్యాన్స్ చేసింది మెట్జ్‌గర్. ఈ సమయంలో తన చుట్టూ చేరిన జనాలు, సైలెంట్‌గా తన పర్సు కొట్టేశారని తెలిపింది. నీళ్ల బాటిల్ కొనుక్కుందామని బ్యాగు కోసం వెతికితే కనిపించలేదని లైవ్‌లోనే తన ఆవేదనను వెల్లబుచ్చుకుంది...
మహిళా రిపోర్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వీడియో ద్వారా నిందితులను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తాను మహిళను కావడంతో పురుష పోలీసులు తన గోడు పట్టించుకోలేదని, చాలాసేపటి తర్వాత మహిళా పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారని తెలిపింది మెట్జ్‌గర్...