వరల్డ్ కప్ కచ్చితంగా కోహ్లీసేనే గెలుచుకుంటుందని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా అన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే చాలా మంది సీనియర్ క్రికెటర్లు... తమ ఫేవరెట్ టీమ్ లను ప్రకటించాయి. తాజాగా.. దీనిపై లారా స్పందించారు.

టీం ఇండియానే కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీమిండియా సమతూకంలో ఉందనీ... అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉన్నందున టైటిల్ గెలుచుకోగలరని జోస్యం చెప్పాడు. ‘‘భారత జట్టు విజేతగా అవతరిస్తే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విభిన్న పరిస్థితుల్లో సైతం వారు చక్కగా రాణిస్తున్నారు. భారత జట్టు చాలా సమతూకంలో ఉంది. భారత్ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహమే లేదు...’’ అని లారా పేర్కొన్నాడు.
 
కాగా సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు సైతం ఈ సారి గట్టిపోటీ ఇవ్వగలదని లారా అన్నాడు. 1975లో ఈ టోర్నమెంటు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలుచుకోలేదనీ... దీంతో ఆ జట్టు ఈ సారి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని లారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.