Asian Championships: ఫైనల్లో ఓడిన దీపక్ పునియా.. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పెరిగిన భారత్ పతకాలు
Deepak Punia: ఆసియా రెజ్లింగ్స్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ పతకాల సంఖ్యను గతేడాది కంటే పెంచుకుంది. స్వర్ణం సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న దీపక్ పునియా ఫైనల్లో నిరాశపరిచాడు. రవికుమార్ దహియా ఒక్కడే స్వర్ణంతో మెరిశాడు.
మంగోలియా వేదికగా జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్స్ ఛాంపియన్షిప్స్ 2022 లో ఆఖరిరోజు ఎన్నో ఆశలు పెట్టుకున్న దీపక్ పునియా ఫైనల్లో నిరాశపరిచాడు. ఉలాన్బాతర్ లో ఆదివారం ముగిసిన 86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో కజకిస్తాన్ కు చెందిన అజమత్ దౌలెత్బెకోవ్ చేతిలో ఓడాడు. 22 ఏండ్ల దీపక్ పునియా..ఆసియా ఛాంపియన్షిప్స్ లో ఆసాంతం రాణించి ఫైనల్లో ఖంగు తినడం భారత అభిమానులను నిరాశపరిచింది. 6-1 తేడాతో అజమత్ విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. దీపక్ కు రజతం దక్కింది. ఇక 92 కేజీల రెజ్లింగ్ ఈవెంట్ లో విక్కీ చాహర్ కాంస్యం నెగ్గాడు.
భారీ ఆశలతో ఈ ఛాంపియన్షిప్స్ లోకి అడుగుపెట్టిన భారత్.. మొత్తంగా 17 పతకాలతో ముగించింది. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో రవికుమార్ దహియా స్వర్ణం సాధించాడు.
రెండ్రోజుల క్రితం రవి.. తన ప్రత్యర్థి రఖత్ కల్జాన్ పై 12-2 తో గెలుపొందాడు. ఇది రవికుమార్ కు వరుసగా మూడో ఏడాది స్వర్ణం. అంతకుముందు అతడు 2020, 2021లలో కూడా స్వర్ణాలు నెగ్గాడు. తద్వారా వరుసగా మూడు ఏడాదుల్లో స్వర్ణం గెలిచిన తొలి రెజ్లర్ గా హ్యాట్రిక్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ఇక ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ లో భారత్ మొత్తం 17 పతకాలు సాధించింది. ఇందులో రవికుమార్ దహియా ఒక్కడే స్వర్ణ విజేత. రజతం సాధించినవారిలో భజరంగ్ పునియా, గౌరవ్ బలియాన్, అన్షుమాలిక్, రాధిక, దీపక్ పునియా ఉన్నారు. విక్కీ చాహర్, సత్యవర్ట్ కడియాన్, నవీన్, మనీషా, సరితా మోర్ లు కాంస్యాలు గెలిచారు. ఈ ఈవెంట్ లో గతేడాది భారత్ కు 14 పతకాలు దక్కాయి. ఈ ఏడాది మాత్రం 3 పతకాలు పెరగడం గమనార్హం.