CWG 2022: ఫైనల్స్‌కు చేరిన భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్.. పతకంపై ఆశలు..
Commonwealth Games 2022: 21 ఏండ్ల నటరాజ్.. అర్హత రౌండ్ లో భాగంగా.. 54.68 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని ఈదాడు. దీంతో సెమీస్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ అదరగొడుతున్నాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్‌లో నటరాజ్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేశాడు నటరాజ్. దీంతో అతడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ పీటర్ కోట్జ్ 53.67 సెకన్లతో సెమీస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ లో నటరాజ్ ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా ఫైనల్లో అడుగుపెట్టాడు.
21 ఏండ్ల నటరాజ్.. అర్హత రౌండ్ లో భాగంగా.. 54.68 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని ఈదాడు. దీంతో సెమీస్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన నటరాజ్.. కామన్వెల్త్ క్రీడలలో ఫైనల్ కు వెళ్లిన రెండో స్విమ్మర్ గా నిలిచాడు.
2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భాగంగా సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదే లు ఫైనల్ చేరారు. కానీ పతకం సాధించలేకపోయారు. 2018 లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన పోటీలలో సాజన్ ప్రకాశ్ ఫైనల్ కు చేరినా అతడు కూడా ఉత్తచేతులతోనే వెనుదిరిగాడు. కానీ 2010 కామన్వెల్త్ క్రీడలలో పారా స్విమ్మింగ్ ఈవెంట్ లో ప్రశాంత కర్మాకర్ కాంస్యం నెగ్గాడు.
మరి 2022లో నటరాజ్ పతకం సాధిస్తాడా..? లేడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ రేసు ఆదివారం జరుగునుంది.
ఇక స్విమ్మింగ్ లో నటరాజ్ మినహా మిగిలిన భారత ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్ లో కుశాగ్ర రావత్ 3:57 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ అతడు ముందుకు వెళ్లలేకపోయాడు. ఇక 50 మీటర్స్ బటర్ ఫ్లై ఈవెంట్ లో ద సజన్ ప్రకాశ్.. 25.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.