CWG 2022: కామన్వెల్త్ గేమ్స్.. కొన్ని చారిత్రక సత్యాలు
Commonwealth Games 2022: స్వతంత్రం రాకపూర్వమే కామన్వెల్త్ గేమ్స్ లో భారత ప్రస్థానం ప్రారంభమైంది. 1934 నుంచి ఇప్పటివరకు ఈ క్రీడలలో భారత్ ప్రతీసారి మెరుగవుతూనే ఉంది.
యునైటైడ్ కింగ్‌డమ్ లోని బర్మింగ్‌హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ క్రీడల కోసమని భారత బృందం ఇప్పటికే బర్మింగ్‌హోమ్ లోని క్రీడా గ్రామానికి చేరుకున్నది. గత కామన్వెల్త్ క్రీడలలో 66 పతకాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి వాటి సంఖ్యను పెంచాలని భావిస్తున్నది.
20కి పైగా క్రీడాంశాల్లో పోటీ పడుతున్న భారత్ ఈ మేరకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ లో భారతదేశానికి చెందిన కొన్ని చారిత్రక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
- 1934లో లండన్ లో జరిగిన రెండో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తొలిసారి పాల్గొంది. ఈ పోటీలలో రెజ్లర్ రషీద్ అన్వర్ కాంస్యం నెగ్గాడు. ఈ పోటీలలో ఆరుగురు అథ్లెట్లు పాల్గొన్నాడు. వీరు అథ్లెటిక్స్, రెజ్లింగ్ క్రీడలలో పాల్గొన్నారు.
- 1934 తర్వాత 1958 వరకు ఈ క్రీడలలో భారత్ పతకం నెగ్గలేదు. 1958లో మిల్కాసింగ్ భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించాడు.
- 1958లో భారత్ ఈ పోటీలకు తొలిసారిగా మహిళా క్రీడాకారులను బరిలోకి దింపింది. స్టెఫానియా డిసౌజా ఎలిజిబెత్ భారత్ తరఫున కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్.
- కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరఫున బ్యాడ్మింటన్ లో షట్లర్లు అమి ఘియా-కన్వల్ సింగ్ లు దేశానికి తొలి పతకం నెగ్గిన మహిళా క్రీడాకారులు. 1978లో ఎడ్మాంటన్ (కెనడా) లో జరిగిన క్రీడల్లో వీళ్లు కాంస్యం నెగ్గారు.
- ఈ క్రీడలలో స్వర్ణం నెగ్గిన తొలి మహిళగా షూటర్ రూపా ఉన్నికృష్ణన్ రికార్డులకెక్కింది. 1998లో కౌలాలాంపూర్ లో జరిగిన క్రీడలలో రూపా.. 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది.
- కామన్వెల్త్ క్రీడలలో భారత్ తరఫున విజయవంతమైన ఆటగాడు షూటర్ జస్పాల్ రాణా.. ఈ క్రీడలలో అతడు ఏకంగా 15 పతకాలు సాధించడం విశేషం.
- 1934 కామన్వెల్త్ గేమ్స్ లో ఆరుగురు క్రీడాకారులను పంపిన భారత్.. 2010 లో అత్యధికంగా 495 మంది అథ్లెట్లను బరిలోకి దింపింది. ఇక 2022 లో 322 మంది పాల్గొననున్నారు.
- మిల్కా సింగ్ తర్వాత అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధించిన ఆటగాడు డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా. 1958 తర్వాత పునియా.. 2010 కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం నెగ్గాడు.