Neeraj Chopra: భారత్‌కు ఊహించని షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్..
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి రెండ్రోజులు ముందు భారత్ కు ఊహించని షాక్ తగిలింది. దేశ స్వర్ణ పతక ఆశలు మోస్తున్న నీరజ్ చోప్రా ఈ పోటీల నుంచి తప్పుకున్నాడు.
అడుగుపెట్టిన ప్రతీచోట పతకంతో తిరిగివస్తున్న ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్ కు భారీ షాక్ ఇచ్చాడు. గాయంతో బాధపడుతున్న అతడు.. ఈ పోటీల నుంచి తప్పుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ తో పాటు ఇటీవలే ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో పతకాలు సాధించి జోరు మీదున్న నీరజ్ పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ గాయం కారణంగా అతడు కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహాతా మీడియాకు వెల్లడించారు. ‘కామన్వెల్త్ క్రీడలు -2022లో నీరజ్ చోప్రా పాల్గొనడం లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తుది పోటీల సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో అతడు పూర్తి ఫిట్ గా లేడు. దీని గురించి అతడే అసోసియేషన్ కు సమాచారం అందించాడు..’ అని తెలిపారు.
ఇటీవలే ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో నీరజ్ చోప్రా రజతం సాధించిన విషయం తెలిసిందే. ఈ పోటీలలో భాగంగా బరిసెను విసిరే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అతడే ఫైనల్స్ అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించాడు. ‘నాలుగో ప్రయత్నం తర్వాత నా తొడలో అసౌకర్యంగా అనిపించింది. అందుకే తర్వాత రెండు త్రోలు సరిగా వేయలేకపోయా.’ అని తెలిపాడు.
గతేడాది కామన్వెల్త్ క్రీడలలో భాగంగా 86.47 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. స్వర్ణం సాధించాడు. ఈసారి కూడా అతడు భారత్ కు పతకం తేవడం ఖాయమనుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో భారత క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జులై 28 నుంచి ఆగస్టు 9 వరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈ మేరకు ఇప్పటికే క్రీడాకారులంతా క్రీడాగ్రామానికి చేరుకున్నారు.