Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: కామన్వెల్త్ క్రీడలను తెలుగులోనూ చూడొచ్చు.. ఏ ఏ ఛానెళ్లలో లైవ్ ఇస్తున్నారో తెలుసా..?

Commonwealth Games 2022: నేటి నుంచి  బర్మింగ్‌హోమ్ వేదికగా ప్రారంభంకాబోతున్న కామన్వెల్త్ క్రీడలకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం నేటిరాత్రి ఈ క్రీడలు ప్రారంభమవుతాయి. మరి వీటిని ఎలా చూడాలంటే.. 

CWG 2022: Here Is How You Watch Commonwealth Games, Live Telecast Available in Telugu too
Author
India, First Published Jul 28, 2022, 1:50 PM IST

22వ కామన్వెల్త్ క్రీడలు నేటి (జులై 28) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగతున్న ఈ క్రీడలను లైవ్ లో చూసే అవకాశాన్ని Sony Sports కల్పిస్తున్నది. ఈ క్రీడలకు  సోనీ  అధికారిక ప్రసారదారుగా వ్యవహరిస్తున్నది. దీంతో సోనీకి చెందిన ఆరు ఛానెళ్లలో ఈ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు.  హిందీ, ఇంగ్లీష్ లోనే కాదు.. తెలుగులో కూడా మ్యాచులను ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ఈ మూడు భాషలతో పాటు తమిళ్ లో కూడా కామన్వెల్త్ క్రీడలను ఆస్వాదించేందుకు సోనీ స్పోర్ట్స్ ఏర్పాట్లు పూర్తి చేసింది.

జులై 28 న ప్రారంభంకాబోయే ఈ మెగా ఈవెంట్ ను భారత్ లో సోనీ 6 నెట్వర్క్ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నది. నాలుగు భాషల్లో ఈ క్రీడలను చూడొచ్చు. 

అవేంటంటే.. 

సోనీ టెన్ 1, సోనీ టెన్ 2, సోనీ టెన్ 3, సోనీ టెన్ 4, సోనీ సిక్స్ లలో కామన్వెల్త్ క్రీడలను చూసే అవకాశమిస్తున్నది సోనీ నెట్వర్క్. వీటితో పాటు Sony LIV app లో కూడా వీటిని లైవ్ లో అందిస్తున్నది. సోనీ స్పోర్ట్స్ తో పాటు  దూరదర్శన్ స్పోర్ట్స్ (DD Sports) లో కూడా వీటిని లైవ్ లో వీక్షించొచ్చు.

ప్రారంభ వేడుకలు : 

72 దేశాల నుంచి 5వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్ లో 20 క్రీడాంశాలను చేర్చారు. ఇంగ్లాండ్ లో  కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం ఇది మూడోసారి. అంతకుముందు 1934లో (రెండవ కామన్వెల్త్ క్రీడలు)  లండన్ లో నిర్వహించగా 2022 లో మాంచెస్టర్ లో జరిగాయి. ఆ తర్వాత 20 ఏండ్లకు మళ్లీ యూకేలో జరుగుతున్నాయి. దీంతో వీటిని ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లాండ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

శుక్రవారం స్థానిక (బర్మింగ్‌హోమ్) కాలమానం  రాత్రి 7 గంటలకు ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ ఈ క్రీడలను అట్టహాసంగా ప్రారంభిస్తారు. సంప్రదాయం ప్రకారమైతే ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజిబెత్ ఈ వేడుకలను  ప్రారంభించాలి. కానీ ఈసారి ఆమె ఈ కార్యక్రమానికి రావడం లేదు. 

పతాకధారులుగా సింధు, మన్ప్రీత్ సింగ్.. 

ప్రారంభ వేడుకల్లో భాగంగా భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా  ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు, హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. భారత బృందానికి వీళ్లు నాయకత్వం వహించనున్నారు. 20 క్రీడాంశాలలో పోటీలు జరుగనున్న ఈ  మెగా ఈవెంట్ లో భారత్ సుమారు 16 క్రీడల్లో బరిలోకి దిగబోతున్నది. 215 మందితో కూడిన మన వీరులు.. ఇప్పటికే బర్మింగ్‌హోమ్ లోని కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అడుగుపెట్టారు. 

 

భారత్ పాల్గొనబోయే క్రీడాంశాలు, ఆడే సభ్యులు.. 

పైన పేర్కొన్న క్రీడాంశాల్లో భారత్ 16 క్రీడల్లో పాల్గొంటున్నది. ఈ మేరకు 215 మంది క్రీడాకారులు బర్మింగ్‌హోమ్ లోనే ఉన్నారు.  ఒక్కో క్రీడను తీసుకుంటే అథ్లెటిక్స్ లో 43 మంది, హాకీ  (పురుషుల, మహిళల జట్లు కలిపి) లో 36, మహిళల క్రికట్ జట్టు నుంచి 15 మంది ఉన్నారు. అంతేగాక వెయిట్ లిఫ్టింగ్ (15 మంది), సైక్లింగ్ (13), బాక్సింగ్ (12),  రెజ్లింగ్ (12), టేబుల్ టెన్నిస్ (12), బ్యాడ్మింటన్ (10), లాన్ బౌల్స్ (10), స్క్వాష్ (9), జిమ్నాస్టిక్స్ (7),  స్విమ్మింగ్ (7), జూడో (6), ట్రయథ్లాన్ (4), పారా పవర్ లిఫ్టింగ్ లో నలుగురు క్రీడాకారులు బరిలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios