తాను బాగానే ఉన్నానని.. తనకేమీ కాలేదని చెబుతున్నారు టీం ఇండియా ఆల్ రౌండర్ సురేష్ రైనా. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ రైనా చనిపోయారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తేూ.. కొందరు యూట్యూబ్ లో వీడియోలు కూడా పోస్టు చేశారు.

ఆ న్యూస్, వీడియోలు చూసి చాలా మంది నిజంగానే రైనా చనిపోయారని భావించారు. రైనా కుటుంబసభ్యులు, అభిమానులు మాత్రం దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే.. ఈ ఘటనపై రైనా తాజాగా స్పందించారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తనపై వచ్చిన వార్తలు నమ్మవద్దని రైనా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. తనపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

‘గత కొంతకాలంగా నేను కారు ప్రమాదంలో మృతి చెందానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్త విని నా మిత్రులు, కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు. ఇలాంటి వార్తలు నమ్మకండి. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. నాపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్‌పై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటా’ అంటూ రైనా ట్వీట్ చేశాడు.