ఇలాంటి ఛాన్స్ దొరకడం ఇదే మొదటిసారి... బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు...
ఇంగ్లాండ్ ఓపెన్ తర్వాత నాలుగు నెలలుగా రాకెట్ పట్టని పీవీ సింధు...
కరోనా కారణంగా ఒలింపిక్స్ ప్రిపరేషన్స్‌కి తగినంత సమయం దొరికిందంటున్న బ్యాడ్మింటన్ స్టార్...
కరోనా వైరస్ కారణంగా క్రీడా ఈవెంట్లు మొత్తం రద్దు అవుతున్నా, తనకి మాత్రం కూసింత మంచే జరిగిందని అంటోంది తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. కరోనా కారణంగా టోర్నీలన్నీ రద్దు కావడంతో గత ఏడాది చాలావరకూ ఖాళీగా గడిపేసిన పీవీ సింధు, ఈ ఏడాది ఆరంభంలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో పాల్గొంది.
అంతకుముందు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైన పీవీ సింధు, ఇంగ్లాండ్ ఓపెన్‌లో సెమీస్ చేరింది. సెమీ- ఫైనల్స్‌లో చోచువాంగ్ చేతిలో వరుస సెట్లలో ఓడింది. ఆ మ్యాచ్ తర్వాత నాలుగు నెలలకు తిరిగి టోక్యో ఒలింపిక్స్‌లో రాకెట్ పట్టబోతోంది పీవీ సింధు.
‘కరోనా వల్ల బ్రేక్ రావడం నాకు బాగా ఉపయోగపడింది. ఈ బ్రేక్‌లో నా ఆటను మరింతగా మెరుగుపర్చుకోగలిగా. ఒలింపిక్స్‌కి అవసరమైన సాధన చేశాననే అనుకుంటున్నా. ఒలింపిక్స్‌కి ముందు కావాల్సినంత సమయం దొరికింది. ఇంత ఖాళీ సమయం దొరకడం ఇదే మొదటిసారి. ఈ బ్రేక్‌లో నేర్చుకున్న టెక్నిక్స్, ఒలింపిక్స్‌లో ఉపయోగపడతాయని భావిస్తున్నా...’ అంటూ తెలిపింది పీవీ సింధు.
ఒలింపిక్స్‌లో ప్రతీ మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పిన పీవీ సింధు, భారత ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పీవీ సింధు, ఈసారి భారీ అంచనాలతో టోక్యోకి వెళ్తోంది.
పీవీ సింధు అంచనాలకు తగ్గట్టు రాణించి, ఒలింపిక్స్ పతకం గెలిస్తే రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత స్వాతంత్య్రానంతరం విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేస్తుంది.