ఘనంగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు విషయంలో ‘కరోనా’ హై డ్రామా...
గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2022... పీవీ సింధు కరోనా ఫలితాల్లో గందరగోళం...
బర్మింగ్‌హమ్ వేదికగా 22వ కామన్వెల్త్ గేమ్స్ 2022 ఘనంగా ప్రారంభమైంది. గురువారం జరిగిన ఆరంభ వేడుకల్లో భారత్ నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు, అథ్లెట్లు... ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుతో పాటు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్... భారత త్రివర్ణ పతకాన్ని చేపట్టి ముందు నడిచారు...
ఆరంభ వేడుకలకు ముందు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కరోనా పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఇంకా కరోనా కలవరం పూర్తిగా తొలిగిపోకపోవడంతో కామన్వెల్త్ గేమ్స్ కోసం బర్మింగ్‌హమ్‌లో అడుగుపెట్టిన అథ్లెట్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు...
బర్మింగ్‌హమ్ చేరుకున్న తర్వాత పీవీ సింధుకి నిర్వహించిన పరీక్షల్లో పూర్తి నెగిటివ్ రిజల్ట్ రాకపోవడంతో ఆమెకు కరోనా సోకినట్టు అనుమానించారు అధికారులు. ఆమెను ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కూడా సూచించారు.. ఇప్పటికే జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కి దూరం కావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన టీమిండియాకి ఈ ఫలితం ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసింది...
పీవీ సింధు కూడా దూరమైతే భారత జట్టుకి గ్యారెంటీగా పతకం తెస్తారనుకున్న ఇద్దరు అథ్లెట్లు మిస్ అయినట్టు అయ్యేది. అయితే రెండో పరీక్షలో నెగిటివ్ రావంతో ఆమెను కామన్వెల్త్ విలేజ్‌కి అనుమతించారు. అధికారుల నుంచి క్లీన్ చిట్ పొందిన పీవీ సింధు, గురువారం రాత్రి 11:30కి ప్రారంభమైన కామన్వెల్త్ ఆరంభ వేడుకల్లో త్రివర్ణ పతకాన్ని చూబూని భారత బృందాన్ని ముందుండి నడిపించింది...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత షెడ్యూల్ మహిళల క్రికెట్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ని ప్రవేశపెట్టారు నిర్వహకులు. ఇందులో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళా జట్టు, ఆస్ట్రేలియాతో సాయంత్రం 4.30 గంటలకు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు భారత మహిళల హాకీ జట్టు, ఘనాతో తొలి మ్యాచ్ ఆడనుంది.