టీం ఇండియా యువ కెరటం పంత్ కి ప్రపంచ కప్ విషయంలో సెలక్టర్ల నుంచి తీవ్ర నిరాశ ఎదురైంది. వయసులో చిన్న వాడు కావడంతో... ప్రతిభ ఉన్నప్పటికీ పంత్ ని పక్కన పెట్టి సీనియర్లకే సెలక్టర్లు  చోటు కల్పించారు. చివరి నిమిషం వరకు తనకు అవకాశం దొరుకుతుందేమోనని పంత్ ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. ఈ విషయంలో పంత్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నట్లు తాజాగా అతను చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. 

‘జాతికి ప్రాతినిథ్యం వహించే క్రమంలో బ్లూ జెర్సీ ధరించినపుడు కలిగే భావన.. టీమిండియాను విష్‌ చేయడంలోనూ దొరుకుతుంది. కనీసం ఇలాగైనా టీమ్‌కు దగ్గరగా ఉండొచ్చు. ప్రపంచకప్‌ని మన ఇంటికి తీసుకురండి బాయ్స్‌!! గుడ్‌లక్‌’ అంటూ పంత్ ట్వీట్ చేశాడు. గురువారం నుంచి ప్రపంచకప్ పోరు ప్రారంభం కానున్న నేపథ్యంలో... పంత్ ఈ ట్వీట్ చేశాడు.

టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్‌ 5న సౌతాంప్టాన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుని ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో పరాభవం చవిచూసిన భారత్... మంగళవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించి సత్తా  చాటింది.