పాకిస్తాన్ కస్టడీ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ శుక్రవరం స్వదేశంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన స్వదేశానికి రావడం పట్ల యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేసింది. కాగా.. అభినందన్ కి భారత క్రికెట్ బోర్డు( బీసీసీఐ) వినూత్నరీతిలో స్వాగతం పలికింది.

‘‘ఆకాశాన్ని జయించావు.. మా హదయాలను గెలుచుకున్నావు’’ అంటూ కీర్తించింది. ‘‘నీ ధైర్య సాహసాలు, నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం’’ అని కొనియాడింది. అభినందన్‌కు స్వాగతం పలుకుతూ ‘‘వింగ్ కమాండర్ అభినందన్ నెంబర్-1’’ అంటూ టీమిండియా జెర్సీపై పేర్కొంది. ఈ మేరకు జెర్సీ ఫోటోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్ పాక్ స్థావరాలపై దాడి జరిపిన సంగతి తెలిసిందే. పాక్‌ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో అభినందన్ నడిపిన మిగ్ 21 ఎయిర్‌క్రాఫ్ట్ పాక్ భూభాగంలో కూలిపోయింది. అలా పాక్ బలగాలకు చిక్కిన అభినందన్.. అ దేశ బందీగా మూడు రోజులు గడిపారు. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం.. శుక్రవారం అభినందన్‌ను పాక్ ఫ్రభుత్వం భారత్ కి అప్పగించింది.