కాంగ్రెస్ నేత, టీం ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెచ్ సీఏ) ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు అజహరుద్దీన్ ప్రకటించారు.

ఈ నెల 21వ తేదీన జరగనున్న హెచ్ సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. దీంతో.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయం ఆరోజే తేలనుంది.

ఇదిలా ఉండగా... హెచ్ సీఏ అధ్యక్ష పదవి కోసం 2017లో అజహరుద్దీన్ నామినేషన్ వేయగా... హెచ్ సీఏ తిరస్కరించింది. బీసీసీఐ ఇచ్చిన నిషేధం ఎత్తివేత పత్రాలను సమర్పించలేదన్న కారణంతో అప్పుడు అజహర్ నామినేషన్ ను తిరస్కరించారు. అంతేకాకుండా ఆయనకు క్లబ్ లో ఓటు హక్కు ఉందో లేదో కూడా తమకు తెలీదని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఎన్నికల్లో అజహర్ పోటీచేయడానికి కుదరలేదు.

దీంతో... ఈసారి ఎన్నికల్లో మాత్రం తాను కచ్చితంగా పోటీ చేస్తానని అజహరుద్దీన్ ప్రకటించారు.  1992, 1996, 1999 ప్రపంచకప్ లో భారత్ ప్రాతినిధ్యం వహించిన అజహరుద్దీన్... 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలతో నిషేదానికి గురయ్యాడు. తర్వాత బీసీసీఐ ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.