ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్ ని భారత్ కోల్పోయింది. మొదటి రెండు మ్యాచ్ లు టీం ఇండియా గెలుచుకోగా.. మిగిలిన మూడు ఆసిస్ కైవసం చేసుకుంది. దీంతో.. సిరిస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. కాగా.. దీనిపై కోహ్లీ స్పందించారు.

అనుకున్నదానికంటే 15–20 పరుగులు ఎక్కువే ఇచ్చినా లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం.  ఆసీస్‌కు గెలిచే అర్హత ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో ఒత్తిడిలో వారు పట్టుదలగా నిలబడ్డారు. ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ప్రపంచ కప్‌కు ముందు తప్పులు సరిదిద్దుకునేందుకు ఇలాంటి ఓటములు మంచిదే. సిరీస్‌ ఓడినా గత కొంతకాలంగా మా జట్టు ఆడిన తీరు పట్ల గర్వపడుతున్నా. చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాం. అయితే ఓటమికి మార్పులు కారణం కాదు. వరల్డ్‌ కప్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం మాలో ఉంది.

ఈ ఓటమితో మేం ఏం కుంగిపోవడం లేదు. జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు.  మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్‌ బలపడుతుంది. అలాగే బౌలింగ్‌ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది. ప్రస్తుత  పరిస్థితుల్లో ప్రపంచకప్‌ బరిలో దిగే ఏ జట్టు హాట్‌ ఫేవరేట్‌ కాదు. మాతో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతూకంగా ఉంది. పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేం.’ అని చెప్పుకొచ్చాడు