2008 ఐపీఎల్ మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ధోనీ వంటి స్టార్ టీమ్‌ల మధ్య ఓ అండర్‌ డాగ్ టీమ్‌గా బరిలో దిగింది రాజస్థాన్ రాయల్స్. అయితే అసాధారణ ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలిచి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత అదే ఇప్పటిదాకా రాజస్థాన్ అత్యుత్తమ ప్రదర్శన. మళ్లీ ఒక్కసారి ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది ఆర్ఆర్ టీమ్.

దీంతో తొలి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు టైటిల్ దక్కించిన ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్‌పై మరోసారి ఆశలన్నీ పెట్టుకుంది ఆ జట్టు యాజమాన్యం. తొలి సీజన్ నుంచి రాజస్థాన్ జట్టుతో కొనసాగుతున్న షేన్ వార్న్, గత సీజన్‌లో ఆర్ఆర్ ప్రచారకర్తగా వ్యవహారించారు. ఈ సారి మెంటర్‌గా కూడా రాజస్థాన్ రాయల్స్‌కు ఆయన సేవలు అందించబోతున్నారు.

కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో పాటు షేన్ వార్న్ కూడా రాజస్థాన్ జట్టుకు కోచింగ్ ఇవ్వబోతున్నారు. ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈసారి రాజస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహారించబోతుంటే... కొత్తగా జట్టులోకి వచ్చిన మయాంక్ మర్కండే, రాహుల్ త్రివాఠియా, అంకిత్ రాజ్‌పుత్, యశస్వి జైస్వాల్ వంటి భారత యంగ్ క్రికెటర్లతో ఆర్ఆర్ పటిష్టంగా కనిపిస్తోంది.

వీరితో పాటు సంజూ శాంసన్, జోస్ బట్లర్, రాబిన్ ఊతప్ప, బెన్‌స్టోక్స్, డేవిడ్ మిల్లర్, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, ఒసానే థామస్ వంటి ప్లేయర్ల నుంచి నూరు శాతం ప్రతిభ రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తానని షేన్ వార్న్ తెలిపాడు.