భారత క్రీడాకారులకు శిక్షణను అందించే క్రీడా సంఘాలు, అవి నిర్వహించే ట్రైనింగ్ సెంటర్లలో లోటుపాట్లు అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాటియాలాలోని  ఎన్‌ఎస్‌–ఎన్‌ఐఎస్‌ డొల్లతనం తాజాగా బ‌య‌ట‌పడింది. 

ఇటీవలే అక్కడి సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు వచ్చిన విషయం విదితమే. తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉందంటూ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేసారు. 

ఆహార నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. మరో అథ్లెట్ హిమ దాస్ తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో ఈ అంశాన్ని ఏకంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియవస్తుంది. వాటి ఫోటోలను సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్‌ఐఎస్‌ పాలక అధికారులకు పంపించిందట. 

అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే క్రీడాకారులకు ఇలా నాణ్యత లేని ఆహారాన్ని అందించడంపై క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఫైర్ అయినట్టు తెలియవస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా అధికారులకు ఈ విషయంగా చివాట్లు పెట్టిన రిజిజు.... తక్షణమే అక్కడ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని ఆదేశించినట్టు తెలియవస్తుంది. 

దీనిపై స్పందించిన స్పోర్టీస్ అథారిటీ అఫ్ ఇండియా.... ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, ఇప్పుడు క్రీడాకారుల అవసరాలకు తగ్గట్టుగా డైట్ అందిస్తున్నామని, నాణ్యతన్యు పెంచమని తెలిపారు. ప్రస్తుతం అందుతున్న ఆహార నాణ్యతపై క్రీడాకారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు.