Rugby League: నిన్న స్విమ్మింగ్.. నేడు రగ్బీ.. ట్రాన్స్‌జెండర్లపై కొనసాగుతున్న నిషేధం
Rugby League Bans Transgender Players: అంతర్జాతీయ ఈవెంట్లలో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లను ఆడించొద్దని అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే రగ్బీ లీగ్ కూడా అదే బాటలో పయనించింది.
అంతర్జాతీయ రగ్బీ లీగ్ (ఐఆర్ఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి జరుగబోయే అంతర్జాతీయ మహిళల రగ్బీ మ్యాచ్ లలో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లను ఆడించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లను ఆడించడం వల్ల ఆట సమతుల్యం దెబ్బతింటుందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల క్రితమే అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్.. ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
లింగమార్పిడి చేసుకున్న స్విమ్మర్లు పురుషుల యుక్తవయస్సు కంటే దాటితే మహిళల ఎలైట్ రేసులలో పాల్గొనరాదని స్విమ్మింగ్ సమాఖ్య ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా ఐఆర్ఎల్ కూడా.. ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.
ఇదే విషయమై ఐఆర్ఎల్ స్పందిస్తూ.. ట్రాన్స్‌జెండర్లను రగ్బీ ఆడించేందుకు గాను సరికొత్త పాలసీలు రావాల్సి ఉంది. ప్రపంచ క్రీడలో సంబంధిత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ రగ్బీ లీగ్ లలో ట్రాన్స్‌జెండర్లను ఆడించే విషయమై ఇంకా పూర్తిస్తాయిలో పరిశోధన జరగాల్సి ఉందని తెలిపింది.
ఐఆర్ఎల్ తాజా నిర్ణయంతో అక్టోబర్ లో ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న లీగ్ మహిళల ప్రపంచకప్ లో ట్రాన్స్‌జెండర్ కీడ్రాకారులు పాల్గొనే అవకాశం లేదు. ఈ పోటీలలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా వంటి జట్టు పోటీ పడుతున్నాయి.
క్రీడలలో ట్రాన్స్‌జెండర్లను ఆడించే విషయమై గత కొన్నాళ్లుగా అనేక పరిశీలనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలో ట్రాన్స్‌జెండర్లకు ఆటల్లో పాల్గొనే హక్కును కల్పించే విధంగా విధానాలను రూపొందించాలని సూచించిన నేపథ్యంలో ప్రపంచంలోని క్రీడా సమాఖ్యలన్నీ దీనిపై కొత్త నిబంధనలు రాసుకుంటున్నాయి.
ఇదిలాఉండగా ట్రాన్స్‌జెండర్లను రగ్బీ లీగ్ నుంచి నిషేధించడంపై క్రీడాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. మరోవైపు ట్రాన్స్‌జెండర్లు మాత్రం ఇది క్రీడల ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. సమానత్వం కోసం పాటుపడే క్రీడల్లో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని వాపోతున్నారు. కాగా.. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడలు ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధించే అవకాశం లేకపోలేదంటున్నారు క్రీడా విశ్లేషకులు.