Neeraj Chopra: జులై లో ముగిసిన  వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించిన నీరజ్.. ఫైనల్ లో తొడ కండరాలు పట్టేయడంతో కీలకమైన  కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ అతడు  ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. 

భారత ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ అథ్లెటిక్స్ లో గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్న అతడు తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. స్విట్జర్లాండ్ వేదికగా లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో ఈటెను 89.08 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు. తద్వారా ఈ ఈవెంట్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. డైమండ్ లీగ్ లో రికార్డు త్రో ద్వారా నీరజ్ వచ్చే ఏడాది బుడాపెస్ట్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్‌నకూ అర్హత సాధించాడు. 

జులై లో ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించిన నీరజ్.. ఫైనల్ లో తొడ కండరాలు పట్టేయడంతో కీలకమైన కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ లో ఆడకపోయినా అవి ముగిసిన కొద్దిరోజులకే జరుగుతున్న డైమండ్ లీగ్‌కు సిద్ధమైన చోప్రా.. రీఎంట్రీని ఘనంగా చాటాడు. 

లుసాన్ డైమండ్ లీగ్ లో తొలి ప్రయత్నంలో బరిసెను 89.08 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా అప్పుడే స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. ఈ త్రో అతడి కెరీర్ లో థర్డ్ బెస్ట్ త్రో కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలో ఈటెను బలంగా విసిరిన చోప్రా.. ఆ తర్వాత రెండోసారి 85.18 మీటర్లే విసిరాడు. మూడో త్రో వేయలేదు. నాలుగో త్రో ఫౌల్ అయింది. ఐదోది కూడా మిస్ చేసిన అతడు.. చివరి త్రోను 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. 

Scroll to load tweet…

నీరజ్ తొలి త్రో తో పోల్చితే మిగిలిన త్రోలు ఏవీ గొప్పగా లేకపోయినా మిగిలిన అథ్లెట్లెవరూ అతడి దరిదాపుల్లో కూడా లేకపోవడంతో చోప్రానే స్వర్ణం పతకం వరించింది. ఇదే ఈవెంట్ లో చెక్ రిపబ్లిక్ ఆటగాడు వాద్లెచ్ జాకూబ్.. 85.88 మీటర్ల త్రో తో రజతం నెగ్గాడు. అమెరికాకు చెందిన థాంప్సన్ కర్టిస్.. 83.72 మీటర్ల త్రో తో కాంస్యం నెగ్గాడు.

Scroll to load tweet…

లుసాన్ లో ఈ రికార్డు ఫీట్ సాధించడంతో నీరజ్.. వచ్చే నెల 7,8 తేదీలలో జ్యురిచ్ వేదికగా జరగాల్సి ఉన్న జ్యురిచ్ డైమండ్ లీగ్ కూ అర్హత సాధించినట్టైంది. అంతేగాక వచ్చే ఏడాది బుడాపెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.