CWG 2022: భారత్‌కు పతకాలను ‘ఎత్తు’తున్న వెయిట్ లిఫ్టర్లు.. మూడో స్వర్ణం అందించిన బెంగాల్ బెబ్బులి షెవులి..

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ - 2022 లో భాగంగా భారత వెయిట్ లిఫ్టర్లు దేశానికి పతకాలను ఎత్తుతున్నారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్ లో భారత్ 6 పతకాలు సాధించగా అవన్నీ మన వెయిట్ లిఫ్టర్లు ఎత్తినవే కావడం గమనార్హం. 

Achinta Sheuli won Gold Medal in Men s 73 kg category in CWG 2022

బర్మింగ్‌‌హామ్ వేదికగా  జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మరో భారత వెయిట్ లిఫ్టర్.. దేశానికి స్వర్ణాన్ని అందించాడు. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షెవులి.. దేశానికి మరో బంగారు పతకాన్ని సాధించిపెట్టకాడు. 21 ఏండ్ల ఈ బెంగాల్ కుర్రాడు.. 313 కిలోల బరువును ‘ఎత్తి పడేశాడు’. ఈ క్రీడలలో ఇప్పటివరకు భారత్ ఆరు పతకాలు సాధించగా అవన్నీ వెయిట్ లిఫ్టర్లు ఎత్తినవే కావడం గమనార్హం. 

వెయిట్ లిఫ్టింగ్ 73 కిలలో ఈవెంట్ లో భాగంగా షెవులి.. బెంగాల్ బెబ్బులిలా గర్జించాడు. స్నాచ్ లో 143 కిలోలను ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జెర్క్ లో 170 కిలోలను అలవోకగా ఎత్తేశాడు. దీంతో మొత్తంగా 313 కిలోల  బరువును ఎత్తాడు.

ఇదే ఈవెంట్ లో మలేషియాకు చెందిన హిదాయత్ మహ్మద్.. 303 కిలోల బరువు ఎత్తి  రజతం సాధించగా.. కెనడాకు చెందిన  షాడ్ డార్సిగ్ని 298 కిలోలు ఎత్తి  కాంస్యం దక్కించుకున్నాడు.  

 

షెవులి స్వర్ణం భారత్‌కు పతకాల పట్టికలో ఆరోవది. ఇంతకుముందు మీరాబాయి చాను (49 కేజీల విభాగం), జెరీమా లాల్‌రిన్నుంగ (67 కేజీల విభాగం) లు స్వర్ణాలు సాధించారు. తాజాగా షెవులి కూడా ‘స్వర్ణ జాబితా’లో చేరాడు. ఈ ముగ్గురే గాక సంకేత్ సర్గార్ (55 కేజీల విభాగంలో) రజతం గెలవగా, బింద్యా రాణి దేవి (మహిళల 55 కేజీల విభాగం) కూడా  సిల్వర్ మెడల్ గెలిచింది. ఇక 61 కేజీల విభాగంలో  కర్నాటకకు చెందిన గురురాజ పుజారి.. కాంస్యం నెగ్గాడు.  

సెమీస్ కు భారత బ్యాడ్మింటన్ జట్టు.. 

వెయిట్ లిఫ్టింగ్ తో పాటు బ్యాడ్మింటన్ లో  సైతం భారత్ అదరగొడుతున్నది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్.. సెమీస్ లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ లో ఇండియా.. 3-0 తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గి సెమీస్ కు అడుగేసింది.  

టీటీ జట్టు.. 

పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ లో భారత్ సెమీస్ కు చేరింది. ఆదివారం ముగిసిన క్వార్టర్స్ లో భారత్ 3-0తో  బంగ్లాదేశ్ ను ఓడించింది. 

కామన్వెల్త్ లో నేటి భారత్.. 

కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత్ షెడ్యూల్  ఈ కింది విధంగా ఉంది. లాన్ బౌల్స్, వెయిట్ లిఫ్టింగ్ (పురుషుల 81 కిలోలు, మహిళల 71 కిలోలు), జూడో, స్విమ్మింగ్, స్క్వాష్, బాక్సింగ్, సైక్లింగ్, హాకీ, టేబుల్ టెన్నిస్, పారా స్విమ్మింగ్ పోటీలలో తలపడనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios