వామ్మో బామ్మ.. 94 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ గెలిచి, స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకున్న భగ్వానీ దేవీ...
వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఓ స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన 94 ఏళ్ల భారత అథ్లెట్ భగ్వానీ దేవి...
30 ఏళ్లు దాటితే చాలు, పట్టుమని 10 మెట్లు ఎక్కడానికి కూడా తెగ కష్టపడిపోతున్నారు నేటి తరం యువకులు. అలాంటిది 94 ఏళ్ల పండు ముసలి వయసులో ప్రపంచవేదికపై భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిందో బామ్మ. ఆమె పేరు భగ్వానీ దేవీ దగర్...
ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో పాల్గొన్న 94 ఏళ్ల భారత అథ్లెట్ భగ్వానీ దేవి, 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌ని 24.74 సెకన్లలో పూర్తి చేసి... గోల్డ్ మెడల్ గెలిచింది. మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ అనగానే ఇందులో అందరూ ముసలివాళ్లు, వృద్ధులే పాల్గొంటారని అనుకుంటే పొరపాటే...
భగ్వానీ దేవితో పోటీపడిన వాళ్లులో చాలామంది 35 ఏళ్లు, ఆపై వయసు ఉన్నవాళ్లు. కేవలం స్ప్రింట్ ఈవెంట్‌తో ఆగని భగ్వానీ భామ, షార్ట్ పుట్ ఈవెంట్‌లోనూ కాంస్య పతకం సాధించింది. డిస్కస్ త్రోలోనూ మూడో స్థానంలో నిలిచి మరో కాంస్యం సాధించింది...
94 ఏళ్ల వయసులో ఓ స్వర్ణం, రెండు కాంస్య పతకాలు సాధించిన భగ్వానీ దేవీ దగర్‌కి న్యూఢిల్లీలో ఘనమైన స్వాగతం లభించింది. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన అభిమానులతో కలిసి చిందులేస్తూ సెలబ్రేట్ చేసుకుంది భగ్వానీ దేవీ దగర్..
ఈ ఏడాది ఆరంభంలో చెన్నై వేదికగా జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన భగ్వానీ దేవీ దగర్, నేషనల్ ఛాంపియన్‌షిప్ గెలిచి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి అర్హత సాధించింది... అంతకుముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల కేటగిరీలో 3 స్వర్ణాలు సాధించింది భగ్వానీ దేవీ దగర్...
‘నేను రోజూ రెండు సార్లు వాకింగ్ చేస్తాను. సాయంత్రం, ఉదయాన్ని వాకింగ్ చేయకపోతే నాకు అస్సలు తోచదు. నా దేశంలో ఇంకొన్ని సార్లు విదేశాల్లో పోటీపడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను... ’ అంటూ చెప్పుకొచ్చింది భగ్వానీ దేవీ దగర్...
94 ఏళ్ల వయసులో భారత దేశానికి పతకాలు సాధించిపెట్టిన భగ్వానీ దేవీ దగర్‌పై భారత మాజీ క్రికెటర్, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ‘వయసు ఎప్పుడూ దేనికీ అడ్డంకి కాదు. అవన్నీ మన మెదడులో మనం పెట్టుకునే హద్దులే... భగ్వానీ దేవీ దగర్ జీ దాన్ని మరోసారి నిరూపించారు. ఆమె ఓ స్ఫూర్తి. మన కలలు, లక్ష్యాలు సాధించడానికి నిజమైన రోల్ మోడల్... ఆమె #SportPlayingNation క్యాంపెయిన్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్’... అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...