ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా బాక్సింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించాడు.

అలా బాక్సింగ్ చరిత్రలోనే తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న టైసన్ 2005లో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఆయన మళ్లీ రింగ్‌లోకి దిగాలని మైక్ టైసన్ భావిస్తున్నాడు. సెప్టెంబర్ 12న 4 డివిజన్ వరల్డ్ ఛాంపియన్‌ రాయ్‌జోన్స్ జూనియర్‌తో తలపడనున్నాడు.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం ద్వారా టైసన్ పంచుకున్నాడు. తన పునరాగమానానికి సంబంధించిన విషయాన్ని టైసన్ ఒక వీడియో ద్వారా షేర్ చేశాడు.

సదరు వీడియోలో టైసన్ గెలుచుకున్న డబ్ల్యూ‌బీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ టైటిల్స్‌ను చూపిస్తూ ఒక పవర్ ఫుల్ పంచ్ ఇవ్వగానే ‘‘ హి ఈజ్ బ్యాక్ ’’ అనే మ్యూజిక్ వస్తుంది. తాను మే నుంచి ప్రారంభించానని, అయితే చారిటీకి ఫండ్స్‌ ఇవ్వడం కోసమే  తాను మరోసారి రింగ్‌లోకి దిగుతున్నట్లు మైక్ స్పష్టం చేశారు.

ఇక తన ప్రత్యర్ధులు తనతో తలబడటానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరాడు. టైసన్ తన కెరీర్‌లో మొత్తం 50 ప్రోఫెషనల్ ఫైట్స్‌ను గెలిచాడు. మొత్తానికి టైసన్ తిరిగి రావడంతో బాక్సింగ్ అభిమానులు, మైక్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.