టీం ఇండియాకి కొత్త కోచ్ ని వెతకడంలో బీసీసీఐ ఉంది. ఇప్పటికే టీం ఇండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. దీంతో... కొత్త కోచ్ ఎవరై ఉంటారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించారు.

‘‘ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో మా సంబంధాలు బాగున్నాయి. అందుకే ప్రధాన కోచ్‌గా ఆయనే కొనసాగాలనుకుంటున్నా. అదే జరిగితే సంతోషిస్తా. ఎందుకంటే శాస్త్రి పర్యవేక్షణలో జట్టు మెరుగ్గా ఆడింది. కానీ ఈ ఎంపిక మా చేతుల్లో లేదు కదా... క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చేతుల్లో ఉంది. ఈ విషయంలో అయితే ఇప్పటిదాకా ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఒకవేళ వారు నా అభిప్రాయం కోరితే చెప్పేస్తా.’’ అని కోహ్లీ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ టూర్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ క్రమంలో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

మళ్లీ రవిశాస్త్రి కోచ్ గా కొనసాగాలని అనుకున్నా... ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  వాస్తవానికి వరల్డ్ కప్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసింది. అయితే.. వెస్టిండీస్ టూర్ ని దృష్టిలో ఉంచుకొని అప్పటి దాకా ఆయన కాంట్రాక్ట్ ని పొడిగించారు.

రవిశాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. మరి కోహ్లీ చెప్పినట్లు రవిశాస్త్రిని కొనసాగిస్తారా.. కొత్త వారిని ఎంపిక చేసుకుంటారో లేదో చూడాలి.