టీం ఇండియాతో వన్డే సిరీస్ అనంతరం వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడంటూ గత కొంతకాలంగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. కాగా... ఆ వార్తలపై తాజాగా క్రిస్ గేల్ స్పందించారు. ప్రస్తుతానికి తాను రిటైర్మెంట్ ప్రకటించడం లేదని తేల్చి చెప్పాడు. తాను ఇప్పటికీ జట్టులోనే కొనసాగుతున్నానని వెల్లడించాడు.

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీం ఇండియాతో జరిగిన ఆఖరి వన్డేలో క్రిస్ గేల్ చెలరేగి ఆడాడు. సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  41 బంతుల్లో 72 పరుగులు సాధించి ఖలీల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయితే గేల్  ఔట్ అయిన తర్వాత భారత ఆటగాళ్లంతా అతనిని అభినందించడం.. మైదానాన్ని వీడుతూ అతను హెల్మెట్లో బ్యాట్ ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివందనం చేశాడు. దీంతో... గేల్ రిటైర్మెంట్ చెప్పడం ఖాయమని అందరూ భావించారు.

మ్యాచ్ ముగిసిన అంనతరం దీనిపై గేల్ స్పందించాడు. రిటైర్మెంట్ గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశాడు. ఇప్పటికీ తాను జట్టులోనే ఉన్నానని తెలిపాడు. వెస్టిండీస్ తరపున అత్యధిక వన్డేలు(301) ఆడడంతో పాటు ఆఫార్మాట్ లో అత్యధిక పరుగులు(10,480) చేసిన క్రికెటర్ గా గేల్ రికార్డు సృష్టించాడు.