ఈ నెలఖారుకి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్ మొదలు కాకముందే క్రికెటర్లపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆసీస్‌ ఆటగాళ్లే లక్ష్యంగా  ఇంగ్లండ్ ఆటగాళ్లు... సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు ఆటకు దూరమైన డెవిడ్‌ వార్నర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్యాండ్‌పేపర్‌తో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ... ఆసీస్‌ స్టార్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, లియాన్‌ నాథన్‌లు చేతిలో బంతితో పాటు సాండ్‌ పేపర్‌ కూడా పట్టుకున్నట్లు ఫొటో షాప్‌ చేశారు. 

అంతేగాక ట్యాంపరింగ్‌కు మూలకారకుడిగా భావించిన డేవిడ్‌ వార్నర్‌ జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా చీట్స్‌ అనే పేరు ముద్రించినట్లు పొట్రేట్స్‌ సృష్టిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, విమర్శలకు తన టీమ్‌ భయపడదని పేర్కొన్నాడు. అన్నింటికీ ఆటతో సమాధానం చెబుతామని వ్యాఖ్యానించాడు. 

‘ త్వరలోనే ఇంగ్లండ్‌కు పయనమవుతున్నాం. వరల్డ్‌ కప్‌ కంటే కూడా యాషెస్‌ మొదలైన తర్వాతే ఇలాంటి కామెంట్లు మరెన్నో వినాల్సి వస్తుంది. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.