Asianet News TeluguAsianet News Telugu

మకర సంక్రాంతికి శబరిమలలో జ్యోతి దర్శనానికి ఏంటి సంబంధం..?

మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు చేస్తాడు. 

What is Makara Jyothi in kerala  Lord Ayyappa's temple ? What is the reason behind it?
Author
Hyderabad, First Published Jan 14, 2020, 12:38 PM IST

మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి జ్యోతి రూపంగా భక్తులకు దర్శనం ఇచ్చే శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మగా తెలియజేయడం జరిగింది.

అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును ( విషం ) చూసి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు ఆ విషాన్ని మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై నాడు. అందులకు సంతోషించిన దేవ,దానవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది.

ఆ అమృతము కొరకు దేవూళ్ళు,రాక్షసులు  వాదులాడుకుని యుద్ధమునకు సిద్ధ పడతారు. అప్పుడు జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్య వంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెళ్ళుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును చూసిన పరమేశ్వరుడు  మోహ పడతాడు.

మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని చూసి లోక కళ్యాణార్ధం శివుని మొహానికి కవ్విస్తాడు. ఆ హరిహరుల గాఢపరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారియై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని ( శ్రీహరి ) తన కంఠమందున్ను మనిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాధుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉత్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచూ ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను.

అలా అండగా మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మీ , సరస్వతి, పార్వతి దేవతల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుట కొరకు ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. 

మహిషి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అప్పుడు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కుడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కావున వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను.

అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా! జన్మించినను భూలోక మందు ఎలా జన్మించును! అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకముము వదిలి నేనెలా భూలోకమునకు వెల్లెదను అని భావించి తన అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునీతో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకుంటారు. 

వారి మొర విని పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాధునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాధుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మొహపరవశము చేశాడు, అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను.

కేరళదేశము నందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు, ఆయన భార్యా సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, వారికి చాలా కాలము వరకు సంతానము కలుగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. 

ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు, అంతలో పంబానదీ తీరమున సర్పము నీడలో ఏడుస్తున్న బాలుని చూసి ఆశ్చర్యపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి, ఆ బాలుని తీసుకుని తన భార్యా మహారాణికి అప్పగించి . జరిగి విషయం తెలియజేస్తాడు. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలవుతుంది. ఆ బాలుని కంఠములో మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలునికి మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు. 

ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా మారుతుంది. అదే కాక పందళరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారున్ని ప్రసవింస్తుంది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. మణికంఠునికి ఐదు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసము చేయించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిస్తారు. అక్కడ మణికంఠుడు తక్కువ కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురు పుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న 'వావరు' అనే అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను.

మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు చేస్తాడు. మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు అనే నెపంతో రాణిగారికి తన పన్నాగపు బుద్దితో మనస్సు మార్చేస్తాడు. చెప్పుడు మాటలు విని స్వార్ధంతో ఆలోచిస్తుంది. మహారాణి ఆజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టిస్తారు.

కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టిస్తాడు దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలయినది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు గురై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెస్తే దానితో  వ్యాధి నయమగును అని చెబుతారు.

ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు యని మహారాజు చింతాక్రాంతుడైతాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల ఋణమును తీర్చుటకై మణికంఠుడు ఆజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోతాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు పరిస్థితుల దృష్ట్యా సరే అనక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళరాజు ఎత్తిన ఇరుముడిని తలపైదాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. 

మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు మణికంఠుడు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానదీ తీరము వైపు పయనమై అక్కడ దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయంలో నారదమహర్షి మహిషికి ఎదురై నిను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాత్రుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండుచేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేస్తాడు.

మహిషిలో నుండి శాపవిమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అపుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామీ! అని అడుగగా మణికంఠుడు... దేవీ నీవు కుడా నా ప్రక్కనే మాళిగాపురోత్తమ్మగా వెలసి  నాతోపాటు నీవు కుడా పూజలను అందుకొని నా దీక్ష చేసి శబరి కొండకు వచ్చిన స్వాములను భాదించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. 

మంజుమాతాదేవి స్వామితో అంటుంది మన వివాహము సంగతి తేల్చండి అని అడుగుతుంది అపుడు దేవీ! మొదటిసారి మాలధరించి కన్నెస్వామిగా 41 రోజుల దీక్షచేసి ఇరుముడి తలపై పెట్టుకుని నా సన్నిధికి ఎప్పుడైతే కన్నేస్వాములు రారో ఆ సంవత్సరం మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాట ఇస్తాడు. 

మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి! మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి ఇంద్రుడే పులిగా మారి స్వామి వారిని తనపై కూర్చోబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా మణికంఠుని పందళ రాజ్యం చేరుతాడు. అక్కడ ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందళరాజు ఎదురువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంస సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి, మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. 

మణికంఠుడు అంగీకరించక  ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి. నా అవతారము పరి సమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా మహారాజు, మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. పందళరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థింస్తుంది వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా + అప్పా అని పిలిచి కన్నకొడుకుగా చుసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలవ బడతాను. 

నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ స్థలంలో నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతీ మకర సంక్రాంతి పర్వదిన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయములో  మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్టులై తీసుకొని వచ్చి పదునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవస్ముక్తిని ఇవ్వగలనని చెబుతాడు.

అయ్యప్పస్వామి చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంపానది తీరాన శబరి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతీ మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు తన భక్తులకు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి.

What is Makara Jyothi in kerala  Lord Ayyappa's temple ? What is the reason behind it?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios