Asianet News TeluguAsianet News Telugu

వసంత పంచమి విశిష్టత

మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. 

Significance of Vasantha Panchami
Author
Hyderabad, First Published Feb 16, 2021, 8:13 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Significance of Vasantha Panchami

వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. 

వసంత పంచమి విశిష్టత :- సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితోకూడిన వంటలను నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.

‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios