గణేష్ చతుర్థి 2022: మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో తెలుసా ?
వినాయక చవతి ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో దేశం అంతటా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు దేశంలోని అనేక ప్రాంతాల్లో చేపడుతారు. అయితే మహరాష్ట్రలో మాత్రం వీటిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ రాష్ట్రంలో ఇది అతి పెద్ద పండుగ.
భారతదేశం అంతటా వినాయకచవతి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈ పండగను అంత్యంత ఘనంగా చేపడుతారు. నిజానికి ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడం ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది మహారాష్ట్రనే. చత్రపతి శివాజీ ఆ రాష్ట్రాన్ని పాలించిన సమయం నుంచి ఇది మొదలైంది. జాతీయవాది, స్వతంత్ర పోరాట యోధుడు అయిన బాలగంగాధర్ తిలక్ దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.
కైలాస పర్వతం నుండి భూమిపైకి వినాయకుడు వస్తారని పేర్కొంటూ ఈ గణేష్ చతుర్థిని నిర్వహిస్తారు. అన్ని అడ్డంకులను తొలగించే శక్తివంతమైన హిందూ దేవుడు వినాయకుడు అని భక్తుల నమ్మకం. భారతదేశంలోని ముఖ్యమైన పండుగలలో ఈ వినాయక ఉత్సవాలు ఒకటి. మహారాష్ట్ర ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకుంటుంది. ఏడు నుండి పది రోజుల పాటు జరిగే ఈ పండుగ అందంగా అలంకరించబడిన పండాలకు వినాయకుని రాకతో ప్రారంభమవుతుంది. విలాసవంతంగా రూపొందించిన పెద్ద గణేశుడి విగ్రహాలను అందంగా అలంకరించిన పెద్ద పండాల్లో ప్రతిష్టిస్తారు.
ముందుగా పూజారి అనేక పూజలు నిర్వహించి స్వామికి స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో విగ్రహాన్ని పవిత్ర జలంతో తడుపుతారు. పూజ సమయంలో గణేశుడికి తీపి కొబ్బరి, బియ్యం పిండితో చేసిన ప్రత్యేక తీపి మోదక్ సమర్పిస్తారు. ఈ కాలంలో ప్రతి పండల్, ఆలయంలో రోజంతా గణేష్ స్తుతి వినబడుతుంది. ప్రజలు కూడా తమ ఇళ్లలో విఘ్నహర్తతో స్వాగతం పలుకుతారు. ప్రతీ రోజు కుటుంబ సభ్యులు మతపరమైన శ్లోకాలు పఠిస్తూ విగ్రహాన్ని పూజిస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ పండుగ వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది.
గణేష్ చతుర్థిలో వీడ్కోలు ఊరేగింపు ఈ పండుగ ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. ఈ సమయంలో గణేశుడికి వీడ్కోలు చెప్పడానికి రాష్ట్రంలోని అన్ని సిటీల్లోని ప్రజలు ఒకే చోటికి చేరుకుంటారు. అనేక మంది సింగర్ లు, డ్యాన్సర్ లు, పూజారులు, ఇతర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు, అలాగే పండాల నుంచి విగ్రహాలు అన్నీ ఊరేగింపుగా ఒకే చోటికి వస్తాయి. ఈ సమయంలో ఆ ప్రాంతం మొత్తం ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాాదాలతో మారుమోగుతుంది. చివర, గణేశ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారాన్ని ‘గణేష్ విసర్జన్’ అని పిలుస్తారు.
మహారాష్ట్రలో సంవత్సరం మొత్తంలో నిర్వహించే అతి పెద్ద పండగల్లో వినాయక చవితి ముఖ్యమైనది. ముఖ్యంగా ముంబై వాసులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గణేశుడు మహారాష్ట్రకు అత్యంత ప్రియమైన దైవం. అందుకే ప్రతీ ఏడాది ముంబైలోనే 6000 కంటే ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు అవుతాయి ప్రజలు పెద్దఎత్తున గణపతి విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించిన పందిళ్ల వద్దకు తీసుకొస్తారు. ముంబైలో ప్రతి ఇంట్లో ఒక విగ్రహం కచ్చితంగా ఉంటుంది. కీర్తనలు, పాటలతో ఆ ముంబై సిటీ మొత్తం ఆధ్యాత్మికతలో మునిగితేలుతుంది.
ఈ సమయంలో ముంబైలో వాతావరణం మొత్తం మారిపోతుంది. పూణేలో కూడా ఇంతే ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. పండుగల సమయంలో ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ముంబైలో ముగింపు వేడుకల రోజున పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి సముద్రపు నీటిలో నిమజ్జనం చేస్తారు. మహా విసర్జనను చూసేందుకు బీచ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. ఈ ఊరేగింపులు ఉదయం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతాయి.